అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఔను మరి.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే అరాచకానికి దారి తీస్తుంది. బీజేపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా..నమో జపమే కనిపిస్తోంది. పార్టీని కొత్త శిఖరాలు ఎక్కించిన నేతగా ఆ మాత్రం కార్యకర్తలకు ప్రేమ ఉండటంలో అర్థముంది. దాన్ని వారు జేజేల రూపంలో ప్రదర్శించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ అభిమాన ప్రదర్శనకు ఓ హద్దు ఉంటుంది. కదా.. అదిగో కమల శ్రేణులు ఆ తేడా గుర్తించకుండా మోడీ కనిపిస్తూనే వెర్రెక్కిపోతున్న తీరు బీజేపీయేతర ముఖ్యమంత్రులకు చిర్రెత్తిస్తోంది. ప్రధానమంత్రి మోడీతో ఇప్పుడు ఇతర పార్టీ ముఖ్యమంత్రులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. సొంత రాష్ట్రంలో జరిగే ప్రధాని పర్యటనల సందర్భంగా.. వారు అవమానాల పాలవుతున్నారు. మోడీ తమ రాష్ట్రానికి వస్తున్నారంటేనే చిరాకు పడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల కోసం ప్రధాన మంత్రి దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లడం మామూలే. అలాంటి సమయాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితరులు ఒకే వేదిక పంచుకుంటారు. అదిగో అప్పడే బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. మోడీ కనిపిస్తే చాలు.. పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. మోడీ జిందాబాద్ అంటూ ఒకటే నినాదాల హోరు.. చివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కూడా అదే తీరు. కనీసం సీఎం చెప్పేది ఏమాత్రం వినిపించుకోకుండా మోడీ.. మోడీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బీజేపీ కార్యకర్తల తీరుతో విసిగిపోతున్న ముఖ్యమంత్రులు.. చివరకు ప్రధాని కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతున్నారు. మొన్న మహారాష్ట్ర, నిన్న హర్యానా.. ఇవాళ జార్ఖండ్.. మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా కార్యకర్తల తీరు మాత్రం మారడం లేదు. ఈ పోకడపై మండిపడుతున్న ముఖ్యమంత్రులు మోడీ తీరును కూడా తప్పబడుతున్నారు. మోడీ ఒక్క సైగ చేసినా.. కార్యకర్తలు మిన్నకుండిపోతారని.. కావాలనే మోడీ వారిని రెచ్చగొడుతున్నారని.. ఆరోపిస్తున్నారు. ఇది ఇతర పార్టీ ముఖ్యమంత్రులను అవమానపరచడమేనంటున్నారు. ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటూ ఆగ్రహిస్తున్న ముఖ్యమంత్రులు.. ఇది దేశానికి ప్రమాదకరమని ఘాటుగా విమర్శిస్తున్నారు. మరి దీనికి మోడీ ఏం సమాధానం చెబుతారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: