అసెంబ్లీ సమావేశాలు ఇక రసవత్తరంగా జరగనున్నాయి. ఈ టర్మ్ లో తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. దానిపై రసవత్తరమైన చర్చ జరగనుంది. ప్రధాన ప్రతిపక్షం అయిన వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షానికి దొరికిపోయింది. వాటినే ఆధారంగా చేసుకొని వైెస్సార్ కాంగ్రెస్ విరుచుకుపడే అవకాశాలున్నాయి. ప్రధానంగా రైతు రుణమాఫీకి ప్రభుత్వం అతి తక్కువ మొత్తం నిధులను కేటాయించింది. ఎటువంటి షరతులూ లేకుండా రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీల్లో పేర్కొన్న తెలుగుదేశం వాళ్లు... ఇప్పుడు కేవలం ఐదంటే ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష పార్టీ విరుచుకుపడుతుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ వల్లనే తాము ఓడిపోయామన్న భావనలో ఉన్న వైకాపా ఈ అంశంపై చర్చ కు పట్టుబడుతుంది. ఇక డ్వాక్రా రుణమాఫీ గురించి అయితే బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. ఒకవైపు డ్వాక్రామహిళలు మాఫీపై ఆశలతో బ్యాంకులకు రుణాలను నెల వారీగా చెల్లించడమే ఆపేశారు. ఈ విషయంలో బ్యాంకు మేనేజర్లు మొత్తుకొంటున్నారు. నోటీసులు జారీ చేస్తున్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల మొత్తం ఉన్న డ్వాక్రా రుణాల మాఫీకి ఒక్క రూపాయి కేటాయించింది లేదు! మరి.. రేపటినుంచి మహిళలపై బ్యాంకర్ల ఒత్తిడి అధికం అవుతుంది. అలాగే ఈ అంశం వైకాపాకి అస్త్రం అవుతుంది. అంతే కాదు.. ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలుగుదేశం పేర్కొన్న ఎన్నో హామీల గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి, ఫించన్ల పెంపుదల.. వంటి అంశాలకు సరైన కేటాయింపులు లేవు. మరి వీటన్నింటినీ వైకాపా ఏ స్థాయిలో అస్త్రాలుగా వాడుకొంటుందో... ప్రభుత్వం వాటిని ఎలా ఎదుర్కొంటుందో... అనేది ఆసక్తికరమైన అంశం!

మరింత సమాచారం తెలుసుకోండి: