తెలుగుదేశం ప్రభుత్వం 1986వ సంవత్సరంలో మండల వ్యవస్థ ప్రవేశపెట్టే విద్యాశాఖ ఉనికి లేకుండా చేసింది. పంచాయతీరాజ్ ఉపాధ్యయులనందరిని ఒక మంత్రదండం వంటి జి.ఓ.లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మార్చివేసి వారికి ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్దేశించబడిన ప్రమోషన్లు ఇచ్చింది. అందువలన తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా తెలుగుదేశం ప్రవేశపెట్టిన జి.ఓ.ను రద్దుచేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పుచెప్పింది. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు సృష్టించి హైకోర్టు తీర్పు అమలుచేయలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఏం జరుగుతున్నది ఎవరికి తెలియడం లేదు. కాంగ్రెసు పాలనలో కొనసాగుతున్న డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు అనే ఉద్యోగాలను వారి ఆఫీసులతో సహా తెలుగుదేశం ప్రభుత్వం రద్దుచేసి మండల విద్యాశాఖాధికారులు అనే పోస్టులు సృష్టించింది. నాటినుండి విద్యారంగం భ్రష్టుపట్టింది. నేటి విద్యారంగంలో అస్తవ్యస్థ విధానాలకి బాధ్యత పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానిదే. నేను 1985వ సంవత్సరంవరకు డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సుగా పనిచేశాను. విద్యాశాఖలో 33 సంవత్సరాల అనుభవంతో ఈ విషయాలు వెల్లడిస్తున్నాను. పుష్‌పుల్ రైలును నడపాలి ----------------------------- నిజాం స్టేట్ రైల్వేకాలంనాటినుండి డోర్నకల్- ఇల్లందు మధ్య రెండు పాసింజరు రైళ్ళు నడిచేవి. ఇల్లందు (సింగరేణి) బొగ్గు గనులకు ప్రసిద్ధి పెద్ద జనాభాగల వాణిజ్య ప్రాంతం. కొన్ని సంవత్సరాలనుంచి ఈ రెండు పాసింజర్లూ రద్దయినాయి. ఇక్కడి ప్రజలు బస్సులు మరియు జీపులలో మహబూబాబాద్ వరకు వచ్చి ట్రెయిన్‌ను క్యాచ్ చేస్తున్నారు. నానా అవస్థలు పడుతున్నారు. కరీంనగర్-ఇల్లందుల మధ్య ప్రతిరోజు పుష్‌పుల్ రైలును నడపాలి. ప్రస్తుత రైల్వేబడ్జెట్‌లో పుష్‌పుల్ రైలును ప్రవేశపెట్టాలి. టిఆర్‌ఎస్ బలం కరీంనగర్‌కు చాలా వుంది. దీనికోసం స్థానిక పార్లమెంట్ సభ్యులు మరియు కెసిఆర్ తమ వంతు కృషిచేయాలి. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయపడాలి. కరీంనగర్-ఇల్లందు మధ్య పుష్‌పుల్ ద్వారా కరీంనగర్-ఖమ్మం జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ‘మన బంగారం’ మంచిదేనా? -------------------------------- ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలలో విద్యార్థులు తెలుగులో మాట్లాడుకుంటే జరిమానాలు విధించటం లేదా ఇతర శిక్షలు విధిస్తున్నట్లు వార్తలు వెలువడిన వెంటనే నిరశనలు వ్యక్తంచేస్తుండటం పరిపాటి అయింది. అయితే తల్లిదండ్రులే ఇంగ్లీషులోనే పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇంటిలో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. మరి అటువంటప్పుడు పాఠశాల నిర్వాహకులను తప్పుపట్టడంలో అర్ధం ఉంటుందా? అదీగాక చాలామంది తల్లిదండ్రులకి తెలుగు చదవటం, వ్రాయటం మాట్లాడటంలో సరైన స్థాయిలో పరిజ్ఞానం ఉందా? కాబట్టి మనమే సరిగ్గా లేనప్పుడు పాఠశాలల వారిని నిందించటంలో అర్ధం ఉంటుందా? తెలుగులో మాట్లాడుకుంటే శిక్షించే పాఠశాలలవారు ఉర్దూలోనో మరో భాషలోనో మాట్లాడుకుంటే ఏమీ అనరు! తెలుగు అంటేనే లోకువ! తెలుగు భాష ఏం పాపం చేసిందని ఈ శిక్ష? పెరుగుతున్న వాహన కాలుష్యం ------------------------------------ నగరాలలో వాహన కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. కల్తీ ఇంధన వాడకం, ఫిట్‌నెస్ లేని వాహనాలను నడపడం ఇత్యాది కారణాలవలన వాహనాల నుండి పొగలు నిర్దిష్ట ప్రమాణం కంటే ఎక్కువగా వెదజల్లబడుతున్నాయి. ఇందువలన వాహన చోదకులు, పాదచారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాధు లు, మూత్రపిండాల వ్యాధులు, కాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రజలను కబళించక ముందే ప్రభుత్వం మేల్కొనాలని పర్యావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాలలో తొలి పది నగరాలలో మన దేశానికి చెందిన నాలుగు నగరాలు చోటుచేసుకోవడం చూస్తుంటే పరిస్థితి ఎంతటి తీవ్ర రూపం దాల్చిందో ఇట్టే అర్థవౌతోంది. రవాణాశాఖ, పోలీస్ ఇతర శాఖల సమన్వయం, సహకారంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలుష్య వాయువుల బెడద నివారించాలి. దేశవ్యాప్తంగా కల్తీ ఇంధనం అమ్మే పెట్రోల్ బంకులను మూసివేసి లైసెన్సులు రద్దుచేయాలి. ఇదే సమయంలో కల్తీ పెట్రోలు, కాలం చెల్లిన వాహనాల వల్ల కలిగే ఇబ్బందులపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఇటువంటి కార్యక్రమాలు కేవలం ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడు మాత్రమే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా విజయవంతవౌతాయ. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: