తెలంగాణ రాష్ట్రాన్ని సింగపూర్‌ తరహాలో తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. తమది కొత్త రాష్ట్రమని, తెలంగాణకు సింగపూర్‌ ఆదర్శంగా నిలుస్తుందని, సింగపూర్‌ మోడల్‌ను ఎంచుకుని తాము ముందుకు సాగుతామని కెసిఆర్‌ వెల్లడించారు. పలు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు, వివిధ ప్రాంతాల సందర్శనలో భాగంగా కెసిఆర్‌ ఇంపాక్ట్‌ (ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌) 2014లో కెసిఆర్‌ ప్రసంగించారు. సింగపూర్‌లో పాలనా విధానం తనను బాగా ఆకట్టుకుందని, అవినీతిరహిత, క్రమశిక్షణ, ఠంచన్‌గా పనులు జరగడం(కాల నిర్వహణ) వంటి అంశాలు తనను బాగా ఆకర్షించాయని, ఈ సూత్రాలను తమ నూతన రాష్ట్రానికి వర్తింపచేయాలనుకుంటున్నానని, దీని వల్ల తెలంగాణ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మారుతుందనే ఆశాభావం తనకు ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్‌ ఉత్తమ లక్షణాలను గమనించిన తరువాత, ఈ పంథానే రాష్ట్రంలో ఖచ్చితంగా అమలుచేయాలని సంకల్పించినట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులకు తమ రాష్ట్రంలో సానుకూల వాతావరణం కల్పిస్తామని, ఏ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా వారికి ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో వారికి వందశాతం గ్యారంటీ ఇస్తున్నట్లు, ఎక్కడికక్కడ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి సకల అనుమతులు త్వరితగతిన పరిశీలన తరువాత కల్పిస్తామని, ఎక్కడా ఎలాంటి జాప్యం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులకు ముందుకు వచ్చేవారికి పన్నురాయితీలు కూడా ఉంటాయని, ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు. ఏ రంగంలో పరిశ్రమలు పెట్టేవారికైనా సముచిత రీతిలో ఉండే పన్నుల మినహాయింపులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఇక్కడి పారిశ్రామికవేత్తలకు పిలుపు నిచ్చారు. పెట్టుబడిదార్లకు తాము కల్పించబోయే పన్నురాయితీలు ఇతరత్రా సౌకర్యాలు ఇతరులకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంత శాతం వరకూ పన్నుల తగ్గింపు ఉంటుందనేది చెప్పడం లేదని, అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బాగా తక్కువగా ఉంటాయని చెప్పగలనని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో పరిశ్రమల స్థాపనకు వచ్చేవారికి ఇచ్చే రాయితీల పద్ధతుల గురించి తాను అధ్యయనం చేశానని, తమ ప్యాకేజీ వాటన్నింటిలోనూ ఉత్తమంగా ఉంటుందని పారిశ్రామికవేత్తలకు ఆయన ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత, తరచూ కోతలపై పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్న విషయాన్ని కూడా కెసిఆర్‌ ప్రస్తావించారు.  గత వైఫల్యాల వల్ల విద్యుత్‌ పరిస్థితి గడ్డుగానే ఉందని, అయితే వచ్చే రెండున్నర, మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉండదని, కోతల భయం వద్దని తెలంగాణ సిఎం భరోసా ఇచ్చారు. త్వరలోనే విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తామని చెప్పారు. ఈలోగా వివిధ పరిశ్రమలు నెలకొనడానికి సమయం పడుతుందని, పరిశ్రమల స్థాపన సమయానికి రాష్ట్రం విద్యుత్‌ విషయంలో మిగులు స్థాయికి చేరుకుంటుందని, తెలంగాణలో ఉన్న అపార బొగ్గు, నదీజలాల వనరులు ఇతర మార్గాలద్వారా విద్యుత్‌ సామర్థ్యం సంతరించుకుంటామని తెలిపారు. ఆర్థిక ప్రగతికి పారిశ్రామికీకరణం చాలా కీలకమనే విషయం తనకు తెలుసునని, జూన్‌లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికాయుతంగా సాగుతున్నామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: