భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండు రోజుల హైదరాబాద్‌ పర్యటన కార్యకర్తలు, నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, కంటోన్మెంట్‌ ఎన్నికలకు సమాయత్తమవుతున్న గ్రేటర్‌ భాజపాకు అమిత్‌షా పర్యటన బలాన్నిచ్చింది. మీ సత్తా చాటండంటూ అమిత్‌షా ప్రోత్సహించడంతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసపై ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర భాజపా నేతలను అభినందించిన అమిత్‌షా గో ఏహెడ్‌ అంటూ భుజం తట్టడంతో భవిష్యత్‌లో మరింత వేగం పెంచాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. తెలంగాణ తమ వల్లే వచ్చిందంటూ కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగట్టేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్ళేందుకు అమిత్‌షా మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో విరమించుకున్న కేసీఆర్‌ అధికారంలోకి రాగానే బద్ధశత్రువైన ఎంఐఎం చేతుల్లో కీలు బొమ్మగా మారడం పట్ల అమిత్‌షా కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఎంఐఎంతో పాటు తెరాసను కూడా శత్రువుగా భావించాలని, ఇందుకోసం అవసరమైతే పార్టీ జాతీయ నేతలను తరచూ తెలంగాణ ప్రాంతానికి పంపించేలా చూస్తానని కూడా అమిత్‌షా రాష్ట్ర నేతల వద్ద పేర్కొన్నారని సమాచారం. తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా కేసీఆర్‌ మౌనం వహించడం, విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తూ చివరి వరకు అడ్డం పడ్డ ఎంఐఎంతో చేతులు కలపడాన్ని గ్రేటర్‌ ప్రజలకు విశదీకరించేందుకు నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని సలహా ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్‌ ప్రభుత్వ తీరును సునిశితంగా పరిశీలిస్తూ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు స్పందించాలని మార్గదర్శనం చేశారు. ఏం చేస్తారో నాకు తెలియదు, తెరాసకు సరైన విధంగా బుద్ధి వచ్చేలా చూడాలని అమిత్‌షా రాష్ట్ర నేతలను ఆదేశించారని తెలిసింది. వాస్తవానికి రాష్ట్ర భాజపా నేతలు కొద్ది రోజులుగా తెరాసపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌, ఆ తర్వాతి స్థానంలో ఉన్న తెదేపా కంటే ప్రభుత్వ తీరుపై భాజపా నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రెండు రోజుల అమిత్‌షా పర్యటన సందర్భంగా నిర్వహించిన సభలలో నేతలు ఎంఐఎం, తెరాసలపైనే ప్రధానంగా విమర్శలను గుప్పించారు. ఇదే దోరణిని భవిష్యత్‌లో కొనసాగించాలని, ప్రజలు 2019 కల్లా తెరాస వాస్తవ రూపాన్ని తెలుకుని భాజపాను ఆదరించడం ఖాయమన్న సంకేతాలను అమిత్‌షా రాష్ట్ర నేతలకు అందించడంతో ఎట్టి పరిస్థితులలోనూ గ్రేటర్‌, కంటోన్మెంట్‌ ఎన్నికల్లో సత్తా చూపాలని గ్రేటర్‌ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. అమిత్‌షా తన పర్యటన సందర్భంగా పార్టీ గెలుపు కోసం పని చేసిన పలువురితో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి నేతలను కలిసి చర్చించారు. పనిలో పనిగా గ్రేటర్‌ ఎన్నికల్లో తెరవెనుక ఉంటూ పని చేసే పలువురితో భేటీ అయ్యారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ నేత రాఘవరెడ్డితో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన పలువురితో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడుతో కూడా భేటీ అయ్యారు. గురువారం రాత్రి సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌తో దాదాపు 45 నిమిషాలు భేటీ అయిన అమిత్‌షా పలు అంశాలపై చర్చించారు. రానున్న గ్రేటర్‌ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీకి సహకరించాలని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ను అమిత్‌షా కోరారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నేతల పనితీరు తదితర అంశాలపై పలువురు హితైషులు, మేధావులతో కూడా అమిత్‌షా చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: