రాజకీయాల్లో అసాధ్యాలంటూ ఏమీ ఉండవు. ఉండేదంతా అవకాశవాదమే. ఈ సంగతిని జగన్, చంద్రబాబు మరోసారి రుజువు చేయబోతున్నారా.. ఓ విషయంలో వారిద్దరూ చేతులు కలపనున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే వస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. త్వరలో నందిగామ, ఆళ్లగడ్డ ఉపఎన్నికలు జరగబోతున్నాయి. నందిగామలో టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల హఠాన్మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. తంగిరాల కుమార్తె సౌమ్యను బరిలో దింపాలని టీడీపీ డిసైడయ్యింది. సాధారణంగా ఇలా సభ్యులు చనిపోయినప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. అదే సంప్రదాయాన్ని నందిగామలోనూ పాటించాలని టీడీపీ ఆశిస్తోంది. ఇందుకు సహకరించాలని చంద్రబాబు జగన్ కు రాయబారం పంపారు. ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఈ రాయబారం నడిపారు. అటు వైకాపాకు కూడా ఆళ్లగడ్డ ఉపఎన్నికల సందర్భంగా టీడీపీ సహకారం అవసరమవుతుంది. అందుకే ఆళ్లగడ్డలో సహకరించే షరతు మీద నందిగామలో పోటీకి నిలపకుండా ఉంటే ఎలా ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నారు. రెండు సభ్యుల మరణంతో వచ్చిన ఉపఎన్నికలే కాబట్టి.. ఎలాగూ సానుభూతి మంత్రం పని చేస్తుంది. అందులోనూ రెండు ప్రధాన పార్టీలకూ ఒకరితో మరొకరికి అవసరం ఉంది. ఆ మాత్రం దానికి పోటీ పెట్టి భంగపడటం ఎందుకన్న ఆలోచన రెండు వైపుల నుంచీ ఉంది. ఇచ్చిపుచ్చుకుంటే పోయేదేముందని రెండు పార్టీలూ భావిస్తున్నా తుది నిర్ణయానికి మాత్రం ఇంకా రాలేదు. అసలే అసెంబ్లీలో ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్న సమయంలో ఉపఎన్నికల కోసం రాజీకొస్తే బావుంటుందా.. అన్న సంశయం కూడా ఇరు పార్టీలకు లేకపోలేదు. కాకపోతే దేని దారి దానిదే అన్న తరహాలో పావులు కదుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: