ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతల అంశం పై శుక్రవారం వాడీ వేడి చర్చ జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో హత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తే... మీ నాన్న వైఎస్ ప్రభుత్వ హయాంలో హత్యల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదని అధికార పక్షం ఎద్దేవా చేసింది. మొత్తంగా వైరి పక్షాలు ఒకరిపై ఒకరు చేసుకున్న మాటల యుద్ధం మాత్రం భుజాలు తడుముకోకుండా... అసెంబ్లీ సాక్షిగా అన్నీ వాస్తవాలే అన్నట్లు మాట్లాడుకున్నారు. టీవీల్లో, పత్రికల్లో చదువుకునే జనానికి ఓ పసందైన వినోదాన్ని పంచారు. ఘాటైన ఆ చర్చలో అదిరిపోయే పంచ్ డైలాగ్ లకూ కొదవ లేకుండా సాగింది. సభలో చర్చ సందర్భంగా... తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోని వచ్చిన మూణ్నెళ్లలోనే రాష్ట్రంలో 14 రాజకీయ హత్యలు జరిగాయని ప్రతిపక్షనేత జగన్ అన్నారు. స్వేచ్చగా పనిచేసేలా పోలీసులకు అవకాశం ఇవ్వాలన్నారు. హత్యలపై ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడలం లేదని మండిపడ్డారు. పరిటాల రవి హత్యకేసులో తనకు క్లీన్‌చిట్ వచ్చిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వంగవీటి హత్యకేసును తాము లేవనెత్తలేదని, రవి హత్య కేసును తమరూ ప్రస్తావించవద్దని జగన్ అన్నారు. గతాన్ని తవ్వడం మానేద్దామని, ప్రస్తుత పరిస్థితిపై చర్చిద్దామని జగన్ సూచించారు. అయితే చర్చ మధ్యలో అధికార పక్ష సభ్యులు పలుమార్లు జగన్ కు పలు హత్యలతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత చేయని తప్పులకు ఈ బఫూన్స్ అందరిచేతా మాటలు అనిపించుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. బఫూన్ అనే పదం వాడడం పై అధికార పక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా దానిని అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ బఫూన్ అనే పదాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి చర్చను కొనసాగించారు. జగన్ చేసిన ఆరోపణలకు అధికారపక్షం అంతే స్థాయిలో సమాధానమిచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరమేధం జరిగిందని టీడీపీ నేత బొండా ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ నేర సామ్రాజ్యాన్ని స్థాపించి 189 మంది టీడీపీ కార్యకర్తలను బలిగొన్నారని మండిపడ్డారు. ప్రాణభయం ఉందని నిండుసభలో కోరినా నాటి ప్రభుత్వం పరిటాల రవికి రక్షణ కల్పించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం పై వైసీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మరో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. వంగవీటి రంగా హత్యకేసు నిందితులకు నజరానా ఇచ్చిందెవరని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: