దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఖరీఫ్‌పై ఆశలు వదిలేసుకున్నారు. తీవ్రమైన వర్షాభావం... కరెంటు కోతలతో అన్నదాతలు విలవిల లాడుతున్నారు. గత వారం పది రోజులుగా వాతావరణంలో తేమ శాతం తగ్గింది. క్రమంగా ఎండ వేడిమి పెరుగుతూ నానాటికి తీవ్రమౌతుంది. ఈ తీవ్రత వల్ల వరికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే ఆవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరెంటు కోతలు... ఎండ ప్రభావంతో వరి, పత్తి, కూరగాయ తోటలు, పండ్ల తోటలు ఎండి పోతున్న పరిస్థితిని చూసి రైతులు ట్రాక్టర్లపై, ఆటోలతో నీటిని తరలించి కుండలతో పొలాలను తడుపుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఈసారి సాగు సగానికి పైగా నారుమళ్లు ఇప్పటికే ఎండిపోయాయి. అనధికారికంగా సాగుతున్న కరెంటు కోతలు, తీవ్రమైన ఎండ వేడిమికి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి వేసిన పంటలను పశువులకు విడిచి పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో ప్రాజెక్టులన్నీ వెలవెల బోతున్నాయి. అందులో భాగంగానే భారీ నీటి పారుదల ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ నేటి వరకు 538 అడుగుల వరకే నీరు చేరుకొగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. వర్షాలు లేకపోవడంతో నీటిమట్టం పెరగడం లేదు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, డిండి, మూసి ప్రాజెక్టులోకి ఆశించిన నీరు చేరుకోలేదు. దీంతో జిల్లాలో పంటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సీజన్‌లో మూడు నెలలు కావొస్తున్నా నీటి మట్టాలు ప్రాజెక్టులలో పెరగకపోగా నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. మరోవైపు విద్యుత్‌ కొరత ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ఎడాపెడా కోతలు విధిస్తూ వ్యవసాయానికి 2 నుండి 3 గంటల సరఫరా కూడా చేయడంలేదు. అదికూడా సక్రమంగా రాకపోవడంతో బోర్లు, బావుల్లో ఉన్న జలాలను కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక ఉష్ణోగ్రతలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. గత ఏడాదితో పోల్చితే జిల్లాలో నీటి నిల్వలు మరింత పడిపోయాయి. ఈసారి త్రాగునీటి కష్టాలు ఏదుర్కోక తప్పని గడ్డు పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైబడి నమోదు అవుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు 4,83,452 హెక్టార్లు కాగా ఇందులో వరి 1,66,126 హెక్టార్లు, పత్తి 2,28,00 హెక్టార్లు ఉంటే ఇప్పటి వరకు 2 లక్షల హెక్టార్ల వరకే పత్తి సాగు చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి మొక్కలు ఎండి పోతున్నాయి. ఎండి పోయిన వరి పోలాల్లో పశువులను, గొర్రెలను మేపుతున్నారు. వరి పొలం, పత్తి పంటలు ఎండి పోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు అయింది. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 18 గంటలు, పట్టణ ప్రాంతాలలో 6 గంటల పాటు కరెంటు కోతలు అధికారికంగా అమలు అవుతున్నాయి. ఆనధికారికంగా ఇంకా ఎక్కువే. వ్యవసాయానికి రోజుకు 4 గంటలు కూడా సరఫరా చేయటం లేదు. దీంతో జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఎండ తీవ్రత కారణంగా వరికి తలమాడు వచ్చే పరిస్థితి నెలకొంది. లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినప్పటికీ నేలపాలయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో నేటికి కొన్ని మండలాల్లో వరి నాట్లను మొదలు పెట్టలేదు. అసలే వర్షాలు లేక కలవర పడుతుంటే కరెంటు కోతలు తోడవడంతో రైతుల గుండెలు మండుతున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు కోతలు తీవ్రం కావడం ఆరకొర వర్షాలతో ఈసారి ఆలస్యంగా పనులు మొదలు పెట్టిన అన్నదాతలకు ఇది శాపంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి కటకట తప్పదని పలువురు మేధావులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: