ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని విషయమై నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ, తన నివేదికను మరో నాలుగు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. దీనిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యే ఉంటుందని విస్పష్టంగా చెబుతూ వస్తున్నారు. తాను కూడా రాజధాని సలహా కమిటీని తొమ్మిది మందితో నియమించారు. రాజధాని రూపురేఖలెలా ఉండాలీ, వేటిని ఎక్కడెక్కడ నిర్మించాలీ, వాటికి నిధుల సమీకరణ ఎలా? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఈ కమిటీని నియమించినట్లు చెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీని గత యుపిఏ ప్రభుత్వం నియమించింది. దరిమిలా కమిటీ తన పని తాను చేసుకుపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సందర్శించి, పరిశీలనలు జరిపింది. ప్రజాప్రతినిధులతోనూ, జిల్లా పాలనా యంత్రాంగాలతోనూ సమావేశాలు నిర్వహిం చింది. ప్రజలు కూడా రాజధాని విషయమై తమ అభిప్రాయాలు తెలుపుకునేందుకూ, సలహాలి చ్చేందుకూ ఈ-మెయిల్‌ ఐడి కూడా ఇచ్చింది. దీనికి స్పందించి తమ కమిటీకి అసంఖ్యాకంగా అభిప్రాయాలూ సూచనలూ వచ్చాయని కూడా శివరామకృష్ణన్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో నివేదిక ఇవ్వవలసిన గడువు దగ్గరపడింది. కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించినప్పుడే ఆగస్టు నెలాఖరులోగా నివేదిక అందజేయాలని గడువు పెట్టింది. ఆ గడువు వారం రోజుల్లోనే ముగియ నుంది. కమిటీ నివేదిక ఈనెల 27 లేదా 28 తేదీల్లో కేేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని రాష్ట్ర మంత్రి నారాయణ కూడా ప్రకటించారు. ఇప్పుడా తేదీలు దగ్గరకు వచ్చేశాయి. దీంతో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధాని విషయమై ఓ కమిటీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర నడిబొడ్డునే రాజధాని ఉంటుందని పదేపదే ప్రకటించిన చందంగానే శివరామకృష్ణన్‌ కూడా ఈ విషయమై స్పందిం చారు. సాధారణంగా ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ నివేదికలను రహస్యంగా ఇవ్వడం పరిపాటి. అయితే శివరామకృష్ణన్‌ కమిటీ ఈ నడిబొడ్డు ప్రాంతం (రాజధాని) గురించి తన అభిప్రాయంగానీ, లేదా కమిటీ అభిప్రాయం గానీ చెప్పకనే చెప్పారు. నడిబొడ్డు ప్రాంతంలో మంచి డెల్టా ప్రాంతం ఉందని, రాజధాని అక్కడే అయితే డెల్టా కుదించుకుపోయే అవకాశం ఉందని అన్నారు. దానివల్ల ధాన్యాగారంగా చెప్పబడే ప్రాంతం హరించుకుపోతే రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని, ఉపాధి పోతుందని చెప్పారు. పైగా భూ సేకరణకు భారీగా నిధులు సమీకరిం చడమూ కష్టమవుతుందని చెప్పారు. సారవంత మైన భూములను రాజధాని నిర్మాణానికి ఉపయోగించడం మంచిది కాదన్నారు. దీంతో నివేదిక ఇవ్వకుండానే కమిటీ తన అభిప్రాయాలు బయటపెట్టవచ్చా అనే చర్చ జరిగింది. రాజధాని విషయమై కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం రెండూ వేర్వేరు వైఖరులు కలిగి ఉన్నాయని స్పష్టంగానే విదితమౌతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కమిటీ రెండు వైఖరులు కలిగి ఉన్నా ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. దీనిపై వాదనలూ, ప్రకటనలు, అనవసర రాద్ధాతం జరగకపోవడం హర్షణీ యమే. ఈ దశలో ఈనెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోయే నివేదికలో శివరామకృష్ణన్‌ ఏం చెప్పనున్నారన్నదే ఉత్కంఠగా మారింది. వెనుకటి తన అభిప్రాయానుసారమే రిపోర్టు ఇస్తారా? అసలు రాజధానిపై ఏమేమి సూచిస్తారు? అభివృద్ధి వికేంద్రీకరణపై ఏం ప్రస్తావిస్తారు? వంటి విషయాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇచ్చే అన్ని నివేదికల మాదిరిగానే రహస్యంగానే అందజేస్తారా? లేక బహిరంగ పరుస్తారా? అని ప్రజల్లో సందేహాలు నెలకొ న్నాయి. నివేదిక బహిరంగపరచనట్లయితే మరి శివరామకృష్ణన్‌ కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సలహా కమిటీతో సమావేశమైనప్పుడు నడిబొడ్డులో రాజధానిపై ఎందుకు విముఖత చూపారన్నది అర్థం కావాలి. శివరామకృష్ణన్‌ నివేదిక ఇచ్చేది కేంద్ర ప్రభుత్వానికి గనుక అది ఆ విషయాన్ని బహిరంగపర్చుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: