ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 30 ఏళ్లపాటు జిల్లాలో తిరుగులేని నేతగా చలామణి అవుతూ వస్తున్న టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నారు. గులాబీ కండువా కప్పుకోవడానికి ఆయన దాదాపు సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ మొదటివారంలో తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు తుమ్మల అనుచరులు, టిడిపి కార్యకర్తలు చెబుతున్నారు. ఆయనతో పాటు జిల్లాలోని టిడిపికి చెందిన ఒకేఒక్క ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), అదేవిధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు(పినపాక), తాటి వెంకటేశ్వర్లు( అశ్వారావుపేట), బాణోతు మదన్‌లాల్‌(వైరా) కారెక్కనున్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలిసింది. ఇంకా టిడిపి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇటీవల ఎన్నికైన ఖమ్మం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌, వివిధ గ్రామాలకు చెందిన టిడిపి సర్పంచ్‌లు, తదితరులు ఉన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మలనాగేశ్వరరావును కెసిఆర్‌ తన మంత్రివర్గంలో తీసుకోబోతున్నారని అధికార పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందా, తర్వాత అనేది ముఖ్యమంత్రి కెసిఆర్‌ సింగపూర్‌ పర్యటన తర్వాత ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ఈ నెలలోనే తుమ్మలనాగేశ్వరరావు టిఆర్‌ఎస్‌లో చేరాల్సి ఉందని, దీనికోసమే ఈ నెల చివరివారంలో కెసిఆర్‌ ఖమ్మం రావాల్సి ఉందని, అయితే తమ నాయకుడికి అనారోగ్యం కారణాల రీత్యా చేరిక వాయిదా పడిందని ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో తుమ్మల కంటే టిడిపి, టిడిపి అంటే తుమ్మల అన్న పేరు ఉంది. ఆయన పార్టీ మారడంతో ఈ జిల్లాలో టిడిపి సగానికిపైగా ఖాళీ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో విభేదాలు, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వైఖరితోనే తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి భవిష్యత్తు లేకపోవడం, పదేళ్లపాటు టిఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలో ఉండే అవకాశాలు అధికంగా ఉండడంతో ఆయన పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తుమ్మలకు నామా నాగేశ్వరరావుతో విభేదాలు ఇప్పటివి కాదని, గత కొన్నేళ్లుగా ఉంటూ వస్తున్నాయని, పార్టీ మారడానికి అది కారణమే కాదని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోవడం, ఈ పరిస్థితుల్లో ఐదేళ్లపాటు ఖాళీగా ఉంటే రాజకీయంగా దెబ్బతినాల్సి ఉంటుందన్న భయం తుమ్మలకు పట్టుకుంది. ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ పార్టీ బలహీనంగా ఉంది. తుమ్మలను తీసుకుని జిల్లాలో టిఆర్‌ఎస్‌ను విస్తరింప చేయాలని కెసిఆర్‌ ఎప్పట్నుంచో ఉన్నారు. అందులో భాగంగానే కెసిఆర్‌ తుమ్మలను ఆహ్వానించారు. ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు తన దగ్గరకు వచ్చిన టిడిపి నేతలతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తుమ్మల చేరికపై రెండు నెలల నుంచే ప్రచారం జరుగుతోంది. దీంతో తుమ్మలకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వరించబోతుంది. దీనిద్వారా మరో పదేళ్లపాటు జిల్లాలో చక్రం తిప్పవచ్చని ఆలోచనలో మాజీ మంత్రి ఉన్నారు. ఆయనతో పాటు టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది. తుమ్మల చేరికను కొత్తగూడెం టిఆర్‌ఎస్‌ జలగం వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వల్ల తనకు మంత్రి పదవి రాకుండా ఆవేదనలో ఉన్నారు. కొంతమంది టిడిపి నేతలు తుమ్మల నాగేశ్వరరావుపై ఆగ్రహంగా ఉన్నారు. ఓడిపోయానని, అధికారం లేదన్న భావనతో ఇన్నాళ్లు ఆదుకున్న పార్టీని దూరం చేసి బయటకు పోవడం సరికాదని అంటున్నారు. అనేక మంది తెలంగాణ టిడిపి నేతలు బుజ్జగించినా తుమ్మల ససేమిరా అంగీకరించలేదని తెలిసింది. ఇదిలావుండగా ఇప్పటిదాకా ముగ్గురు ఎమ్మెల్యేలతో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఖమ్మం జిల్లాలో బలంగా ఉంది. తెలంగాణలో ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలందరూ వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు. మరికొంతమంది దూరంగా ఉన్నారు. ఈ సమయంలో జిల్లాలోని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ రాజీనామా చేస్తే తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగైనట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: