పట్టుదల ఉంటే కానిది లేదు.. మనసును మించిన ఆయుధం లేదు.. ఇలాంటి మాటలు చెబుతుంటే ఏమిటో అనుకుంటాం.. కానీ వాటిని అమలులో పెట్టి చూస్తే..అద్భుతాలు జరుగుతాయి.. నమ్మలేని వాస్తవాలు కళ్ల ముందు నిలుస్తాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మణిపూర్ కు చెందిన ఇరోమి చాను షర్మిల. భారత దేశానికి గాంధీ అందించిన గొప్ప ఆయుధం నిరాహారదీక్ష. నిరసనను అహింసాయుతంగా వెల్లడించే మహాయుధం. నాటి మహాత్మా గాంధీ యుగం నుంచి అన్నా హజారే యుగం వరకూ ఈ ఆయుధం అద్బుతంగా పనిచేస్తూనే ఉంది. ప్రజాగ్రహానికి ప్రతీకగా.. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరుకు మద్దతుగా నిలుస్తూనే ఉంది. ఆ బాటలోనే నడుస్తోన్న మరో ఉక్కు మనిషి ఇరోమి చాను షర్మిల. అహింసతో హింసను ఎదుర్కొంటున్నధీర వనిత. ఏంటీ షర్మిల ప్రత్యేకత..? అన్నం ముట్టకుండా ఎంతసేపు ఉండగలం.. కొన్నిగంటలు.. మహా అయితే ఒక రోజు.. పంతం పెరిగితే ఇంకొక్కరోజు.. రాజకీయ సునామీలను సృష్టించిన నిరాహారదీక్షలు కూడా చాలావరకూ పక్షం రోజులు దాటలేదు. తెలుగునేలపై దీక్షలు తలచుకుంటే.. ఆనాటి పొట్టి శ్రీరాములు దాదాపు 50 రోజులకు పైగా దీక్షచేసి అసువులు బాసాడు. కేసీఆర్ దాదాపు 14 రోజుల వరకూ దీక్ష చేశాడు. మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ మహిళ.. ఒకటి కాదు రెండు.. కాదు.. దాదాపు 14 ఏళ్ల నుంచి ఆహారం ముట్టడం లేదు. పచ్చిగంగైనా పెదవి దాటి గొంతు చేరనివ్వలేదు. మరి ఆహారం లేకుండా అన్నేళ్లు ఎలా బతుకుతోంది.. ఇదేగా మీ సందేహం.. ముక్కు ద్వారా ట్యూబు ద్వారా బలవంతంగా ద్రవాలు పంపుతున్నారు. అదీ ఆమెకు ఇష్టం లేకుండానే. అసలు ఎవరీ షర్మిల...? ఇంతకూ ఎవరీమె.. ఎందుకంత పట్టుదల ఎవరి కోసం ఈ కఠోర దీక్ష.. ఓసారి చూద్దాం.. ఇది 14 ఏళ్ల కిందట ముచ్చట. ఇరోమి షర్మిలకు అప్పటికి 28 ఏళ్లు. ఆ వయసులో అమ్మాయిలు.. చదువులపైనో, కేరియర్ పైనో.. లేకపోతే వివాహబంధంవైపో మొగ్గుచూపుతారు. కానీ ఓ అనూహ్య సంఘటన షర్మిల జీవితాన్ని ఈ ఆధునిక సత్యాగ్రహానికి పురిగొల్పింది. ఎవరెలా పోతే నాకేంటి. నా కడుపు నిండితే చాలు.. అనే తత్వం నరనరానా జీర్ణించుకుంటున్న నవతరం యువతలా ఆమె ఆలోచించలేదు. తన సొంతరాష్ట్రంలో జరిగిన అమానవీయకాండను ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఇంతటి దారుణాలు చూస్తూ ఊరుకోవాలా.. ఇలా ఇంకెన్నాళ్లని ప్రశ్నించుకున్నారు.. దాని ఫలితంగానే ఈ సత్యాగ్రహం.. ఏళ్లతరబడి సాగుతున్న నిరాహారదీక్ష. ఇంతకూ మణిపూర్లో ఏంజరిగింది..? అది నవంబర్ 2, 2000 సంవత్సరం.. మణిపూర్లోని మాలోమ్ అనే చిన్నపట్టణంలో ఆరోజు జరిగిన సంఘటన షర్మిల జీవితాన్ని మలుపుతిప్పింది. సైన్యానికి చెందిన కాన్వాయ్ పై ఎవరో చేసిన దాడికి ప్రతిస్పందనగా సైనికులు రెచ్చిపోయిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రత దృష్ట్యా సైన్యం ప్రతిఒక్కరినీ అనుమానించడం అలవాటైపోయింది. ఉగ్రవాదులదాడికి ప్రతీకార చర్యగా ఆరోజు మాలోమ్ బస్టాపులో నిల్చున్న జనంపైకి సైన్యం అమానుషంగా కాల్పులు జరిపింది. 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమానవీయ దాడి.. చనిపోయిన వారిలో 62 ఏళ్ల వృద్దురాలు కూడా ఉంది. పోనీ ఆ దాడితో సైన్యం పగ చల్లారిందా.. లేదు.. దాడి తర్వాత కూడా దొరికివారిని దొరికినట్టు చితకబాదింది. అరాచకం సృష్టించింది. ఈ అమానవీయకాండపై ఆనాటి పత్రికలు ఘోషించాయి. ఈ మొత్తం ఘటన షర్మిల ఆలోచనాధోరణిని మార్చేసింది. తన రాష్ట్రం వారి కోసం.. తన తోటివారి కోసం ఏదైనా చేయాలని తలచింది. సైన్యం దారుణాల గురించి తెలిసి కూడా ధైర్యం కోల్పోకుండా.. నిరాహారదీక్షకు దిగింది. మాలోమ్ లో ఆ దారుణం చోటుచేసుకున్న రోజు గురువారం. ప్రతి గురువారం ఉపవాసం చేయడం షర్మిలకు అలవాటే.. ఆ అలవాటునే ప్రజాస్వామ్య అస్త్ర్రంగా ప్రయోగించింది షర్మిల. ఆ రోజు మొదలైన దీక్ష నేటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మణిపూర్ సర్కారు ఏం చేస్తోంది.? షర్మిల నిరాహారదీక్షతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న సాకుతో మణిపూర్ సర్కార్ షర్మిలను అరెస్టు చేసింది. ఉపవాసదీక్ష భగ్నం చేయాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ షర్మిల పచ్చిగంగను కూడా గొంతదాటనివ్వలేదు. ఖాకీల ప్రతాపం ఉక్కు సంకల్పం ముందు ఓడిపోయింది. చేసేది లేక.. ముక్కులోనుంచి ట్యూబు వేసి.. ద్రవాలు పంపుతూ ఆమె ప్రాణాలు కాపాడుతూ వస్తున్నారు. 28 ఏళ్ల వయసులో దీక్ష ప్రారంభించిన షర్మిలకు ఇప్పుడు 42 సంవత్సరాలు. యవ్వనం గడిచిపోయింది. మధ్యవయస్సులోకి అడుగుపెట్టింది. పవిత్ర ఆశయం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. 14 ఏళ్లుగా ప్రభుత్వ నిర్బంధంలోనే జీవితం గడుపుతోంది. ఏడాదికోసారి విడుదల - మళ్లీ అరెస్ట్ చట్టప్రకారం ఆత్మహత్య నేరం.. షర్మిలను మణిపూర్ సర్కార్ ఈ నేరం కిందే అరెస్టు చేసింది. ఈ నేరానికి గరిష్టంగా ఏడాది వరకూ జైలు శిక్ష విధించవచ్చు. అంతకు మించి నిర్బంధంలో ఉంచే అవకాశం లేదు. అందుకే ప్రభుత్వం ఏడాది కోసారి ఆమెను విడుదల చేస్తుది. ఎలాగూ షర్మిల నిరాహారదీక్ష కొనసాగిస్తూనే ఉంటుంది కనుక.. మళ్లీ అదే చట్టం కింద షర్మిలను అరెస్టు చేస్తుంది. ఇలా దాదాపు 14 ఏళ్లుగా షర్మిల ప్రభుత్వ నిర్బంధంలోనే జీవితం సాగిస్తోంది. ఆరోగ్యం సంగతేంటి..? మరి ఏకధాటిగా ఏళ్లతరబడి ద్రవాలపైనే ఆధాపడి జీవిస్తే.. ఆరోగ్యం సంగతేంటి.. శరీరం ఈ నిరంతర నిరాహార దీక్షకు సహకరిస్తుందా.. ఎలా సహకరిస్తుంది. ఆమె కూడా ఓ మనిషే కదా.. కానీ మానసిక శక్తే ఆమెకు జీవనాధారమవుతోంది. ఏనాటికైనా మణిపూర్ వాసుల పాలిట మృత్యువుగా పరిణమించిన కఠిన చట్టాలను రూపుమాపాలన్నదే షర్మిల లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో తన ప్రాణాలు కోల్పోవడం అన్నది ఆమెకు చాలా చిన్నవిషయం. అందుకు ఆమె దీక్షకు కూర్చున్న తొలిరోజే మానసికంగా సిద్ధపడింది. నిరాటంకంగా సాగుతున్న అనారోగ్యదీక్ష కారణంగా.. ఆమెకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కడుపులో అల్సర్ మంటలు చెలరేగుతున్నాయి. రోజురోజుకూ శక్తి సన్నగిల్లుతోంది. కనీసం నాలుగు అడుగులు వేసేందుకు కూడా సత్తువ ఉండదు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా పట్టుదలే ఆమెకు ప్రాణవాయువుగా మారింది. అసలు ఏంటా చట్టం.. ఏమా కథ.. AFSPA-1958 ఈ చట్టమే షర్మిల పోరాటానికి కారణమైంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సైనికులకు విశేష అధికారాలు కల్పించే చట్టం ఇది. దేశ భద్రతకు, సమగ్రతను కాపాడేందుకు సైన్యానికి కల్పించిన వెసులు బాటు.. ఐతే చాలా చోట్ల ఇది దుర్వినియోగం అవుతోందని ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల్లో దీన్ని అడ్డంపెట్టుకుని స్థానికులను వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సైన్యం మాత్రం దేశ రక్షణ కోసమే తామీ చట్టాన్ని వాడుతున్నామని చెబుతోంది. ఈ చట్టం చరిత్ర చూస్తే.. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారతీయులను కట్టడిచేసేందుకు దీన్ని రూపొందించారు. ఆ తర్వాత.. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత 1958లో కొన్ని మార్పులు చేసి ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 1972లో సైన్యానికి మరిన్ని అధికారాలు కట్టబెడుతూ మరికొన్ని సవరణలు చేశారు. ఇది ఇప్పుడు సైన్యం చేతిలో పాశుపతాస్త్రమైంది. దేశ భద్రత దృష్ట్యా దీన్ని తప్పుబట్టలేం. కానీ ఆదే చట్టాన్ని దుర్వినియోగం చేసి స్వదేశీయుల స్వేచ్ఛనే హరించే పరిస్థితిని మాత్రం సమర్థించలేం. షర్మిల కోరుతున్నదీ అదే. షర్మిల సాధించిందేంటి..? పద్నాలుగేళ్ల పోరాటం.. సరే ఇన్నేళ్ల అవిరామ పోరాటంలో ఆమె సాధించిందేంటి.. ఈ ప్రశ్నకు సమాధానం సంతృప్తికరంగానే ఉంది. మణిపూర్లో జరుగుతున్న అరాచకాలను ఆమె ప్రపంచం దృష్టికి తెచ్చింది. నిరంతర నిరాహారదీక్ష ద్వారా సమస్య తీవ్రతను దేశానికి చెప్పింది. అనేక మానవహక్కుల సంఘాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమె పోరాటాన్ని గుర్తించాయి. నైతిక మద్దతు తెలిపాయి. నోబెల్ శాంతి బహుమతి విజేత షిరీన్ ఎబది.. స్వయంగా షర్మిలను కలసి మద్దతిచ్చారు. అన్నా హజారే వంటి వారు ప్రతినిధులను పంపి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. షర్మిల పోరాటానికి స్పందనగా అనేక మంది నేతలు సమస్యను పరిష్కరిస్తామంటూ హామీలు ఇచ్చారు కానీ అవన్నీ కార్యరూపం దాల్చలేదు. కానీ షర్మిల నిరాశకులోనవలేదు. గీతాచార్యుడు చెప్పినట్టు.. కర్మ చేయడం వరకు మాత్రమే మనకు అధికారముందని నమ్మ షర్మిల పోరాటంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. తాజాగా.. ఇరోమ్ షర్మిలను విడుదల చేయాలని స్థానిక సెషన్స్‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా కోర్టు తప్పుపట్టింది. ఐతే.. మరోసారి మణిపూర్ సర్కారు పాత వ్యూహాన్నే అమలు చేసింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుతోందన్న పాత సాకుతో ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలను పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు తాజాగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇలాంటి నిర్బంధాలు ఆమెకు కొత్తకాదు కదా.. షర్మిల పోరాటానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఏదేమైనా ఒక సదాశయం కోసం జీవితాన్ని, ఆరోగ్యాన్ని సమస్తాన్ని త్యాగం చేస్తూ.. రోజూ మృత్యువుతో పోరాడుతున్న ఇరోమ్ షర్మిల మనకాలపు గాంధీ అంటే అతిశయోక్తి కాదేమో. ఆమె తన పోరాటంలో విజయం సాధించాలని మనసారా కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: