ఇక్కడ బాబు.. అక్కడ మోడీ.. ఇక అభివృద్ధి పరుగో పరుగు. ఇదీ ఇన్నాళ్లూ తెలుగుదేశం నేతలు వల్లించిన ప్రగతి పాట. చంద్రబాబుకు మోడీ వద్ద మాంచి పలుకుబడి ఉందని.. కేంద్రం నుంచి నిధులు అందుతాయని వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు ఉదాహరణగా పదేళ్ల నాటి ఎన్డీఏ పాలనను ఉదాహరణగా చెప్పేవారు. ఇప్పుడూ అదే సీన్ రిపీటవుతుందని ఢంకా బజాయిస్తున్నారు. కానీ అంత సీన్ లేదని మెల్లమెల్లగా దేశం నేతలకే అర్థమవుతోంది. ఇప్పుడు ఆంధ్రానేతలు అంతగా ఆశపెట్టుకోవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పేశారు. రక్షణ మంత్రిగా కూడా ఉన్న అరుణ్ జైట్లీ.. ఓ యుద్ధ నౌకను ప్రారభించేందుకు విశాఖ వచ్చారు. ఆ సమయంలో కేంద్ర సాయం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు జైట్లీ బదులిచ్చారు. కేంద్ర సాయమంటే.. ఒకేసారి ఏపీ ఖాతాలోకి నిధులు జమ చేయడం కాదని క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నేరవేరుస్తామన్న జైట్లీ.. అందుకు తగిన ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి రావాలని సూచించారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ చాలా నష్టపోయిందన్న మాట వాస్తవం. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒప్పుకున్నారు. హైదరాబాద్ వంటి భారీ ఆదాయవనరును ఏపీ కోల్పోయింది. కనీసం విభజన చట్టంలో పేర్కొన్న లోటు బడ్జెట్ ను కేంద్రం భరిస్తుందన్న హామీ కూడా ఇంతవరకూ అమలు కాలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించినా.. ఇంతవరకూ దానికీ దిక్కులేదు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆర్థికమంత్రే అంతగా ఆశపడొద్దని నేరుగా అసలు విషయం కుండబద్దలు కొట్టేశారు. విభజన కష్టాలు ఓవైపు, కొత్త రాజధాని మరోవైపు.. భారీ ఎన్నికల హామీలు ఇంకోవైపు.. మరి వీటితో చంద్రబాబు ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: