రెండు తెలుగు రాష్ట్రాలు కొన్ని విషయాల్లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. మిగిలిన విషయాల సంగతేమో కానీ ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రం తెలంగాణ పోలీసులను ఫాలో అవ్వాలని డిసైడయ్యింది. తెలంగాణ పోలీసుల విషయంలో ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి చాలా ఆసక్తి చూపారు. వారి యుద్ధప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. నెలరోజుల్లోపుగానే.. అనుకున్న నిర్ణయాలను ఆచరణలో చూపించారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కొత్త వాహనాలతో కళకళలాడుతున్నారు. కొత్త రాష్ట్రం కొత్త వాహనం అంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. వాహనాల విషయంలో తెలంగాణనే ఫాలో కావాలని ఏపీ డీజీపీ జేవీ రాముడు డిసైడయ్యారు. ఏపీకి కూడా కొత్త వాహనాలు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. విభజన తర్వాత ఏపీకి పూర్తిస్థాయిలో వాహనాలు కరవయ్యాయి. చాలా వరకూ పాత వాహనాలతోనే ఏపీ ఖాకీలు నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు వాహనాల కోసం బడ్జెట్ లో వంద కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తంతో అన్ని సౌకర్యాలు ఉన్న 150 కొత్త వాహనాలు కొనాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వాహనాలను పరిశీలించిన ఏపీ పోలీసులు అంతకన్నా మెరుగైన వాహనాలు తెచ్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కొత్త వాహనాల కొనుగోలుపై నిర్ణయం తీసుకునేందుకు ఏపీ పోలీసులు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో డీజీపీ జేవీ రాముడు అద్యక్షడుగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఠాకూర్, పీ అండ్ ఎల్ అడిషనల్ డీజీ కౌముది ఉంటారు. తెలంగాణను కాపీ కొట్టామన్న పేరు రాకుండా అంతకంటే మెరుగైన వాహనాలు కొనాలని ఈ కమిటీ భావిస్తోంది. కమిటీ సత్వరమే కసరత్తు పూర్తి చేసి.. నివేదిక ఇస్తే..దానిని బట్టి వాహనాల కొనుగోలు వ్యవహారం ముందుకెళ్తుంది. ఈ మొత్తం తతంగమంతా నెలరోజుల్లోనే పూర్తి చేయాలని ఏపీ పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: