ప్రజాకర్షక పథకాలకు తమిళనాడు పెట్టింది పేరు. అది కరుణానిధి ప్రభుత్వమైనా.. జయలలిత ప్రభుత్వమైనా.. జనంపై వారికున్న ప్రేమ వివిధ పథకాల రూపంలో పొంగిపోతుంటుంది.. దేశంలో ఎక్కడలేనంతా ప్రజాకర్షక పథకాల జోరు తమిళనాట సామాన్యం. గతంలో ఇంటికో కలర్ టీవీ వంటి నినాదాలు ఇక్కడ నుంచి వచ్చినవే. 2011లో మరోసారి అధికారం చేపట్టిన జయ.. అమ్మ పేరుతో వరుసగా సంక్షేపపథకాలు ప్రారంభించారు. ఇప్పటికే.. అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపు, అమ్మ ఉప్పు, అమ్మ విత్తనాలు వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ మధ్యనే అమ్మ బేబీ కేర్ కిట్ అంటూ మరో కొత్త పథకం కూడా జయ ప్రకటించింది. ఇప్పుడు జయలలితను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటామంటోంది తెలంగాణ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన కులాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ఈ నిజామాబాద్ ఎంపీ చెబుతోంది. ఎంబీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శనివారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడింది. అభివృద్ధి పథకాల ఫలాలు వెనకబడిన కులాల ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని కవిత చెప్పింది. రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ఎంబీసీ కులాలలో అర్హులకు నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. త్వరలో కేసీఆర్ తో సమావేశం ఏర్పాటు చేసి వెనుక బడిన కులాల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని కవిత వారికి హామీ ఇచ్చింది. హామీలు, వాగ్దానాలు ఇవ్వడం బాగానే ఉంటుంది.. కానీ ఆచరణలోనే వస్తోంది ఇబ్బందంతా.. ఇప్పటికే కేసీఆర్ ఎన్నికల సమయంలో అంతులేని హామీలు గుప్పించారు. ఇల్లులేని వారికి డబల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటిలో ఇంతవరకూ ఒక్కటి కూడా నెరవేర్చలేదు.. సరికదా.. ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. దళితులకు భూమి అంటూ జిల్లాకో ఊరును నమూనాగా తీసుకుని ప్రారంభించారు. జిల్లాకో ఊరు ఇస్తే మిగిలిన వాటి సంగతేంటి.. అందుకే.. టీఆర్ఎస్ నేతలు ప్రచార ఆర్భాటం మాని అమలుపై దృష్టిపెట్టడం మంచిందంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: