తెలుగు రాష్ట్రాల మధ్య అధికారుల విభజనలో అనేక సిత్రాలు చోటుచేసుకున్నాయి. చాలా మంది ఇప్పుడు పనిచేస్తున్న క్యాడర్ కాకుండా పక్క రాష్ట్రం క్యాడర్లోకి వెళ్లారు. సర్వీసు అధికారుల్లో పలువురు భార్యాభర్తలు కూడా ఉన్నారు. వీరిలో భర్త ఒక రాష్ర్టానికి ఎలాట్ అయితే.. భార్య మరో రాష్ర్టానికి ఎలాట్ అయ్యారు. ఏపీ ఫేవరట్ అధికారులు ముద్రపడ్డవారు తెలంగాణకు.. తెలంగాణపై అభిమానంతో పనిచేసివారు ఏపీకి వెళ్లాల్సి వస్తోంది. బీపీ ఆచార్యను తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తే..ఆయన భార్య రంజీవ్ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అజయ్‌సహానీని ఏపీకి కేటాయిస్తే... ఆయన భార్య నీలం సహానీని తెలంగాణకు కేటాయించారు. అలాగే రెడ్డి సుబ్రమణ్యం దంపతులు, ఆర్‌ఆర్ మిశ్రా దంపతులు వేరువేరు రాష్ట్రాలకు కేటాయించారు. ఐపీఎస్ అధికారుల వ్యవహారంలోనూ అదే సీన్ కనిపించింది. ఏపీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ టీపీ దాస్ ను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ అమిత్ గార్డ్ ను ఏపీకి కేటాయించారు. అమిత్ గార్డ్ తెలంగాణ ఆప్షన్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీపీ అనురాధ తెలంగాణకు వస్తే.. ఆమె భర్త సురేంద్రబాబును ఏపీకి ఇచ్చారు. అన్నదమ్ములైన అభిషేక్ మహంతి, అవినాష్ మహంతి ఇద్దరూ తెలంగాణకే ఆప్షన్ పెట్టుకుంటే.. అభిషేక్ ఏపీకి, అవినాష్ తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శించిన ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్.. చివరకు తెలంగాణకే వచ్చారు. ఇవేకాకుండా మరెన్నో ఉదాహరణలు. మరి ఈ లోటుపాట్లపై సర్దుబాటు ఉంటుందా? అధికారులు కోరుకుంటే మార్పులు ఉంటాయా? లేక రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుంటే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అసలు అందుకు కేంద్రం అంగీకరిస్తుందా? అనే చర్చ ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వారం వ్యవధిలో తమ అభ్యంతరాలను తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. వారి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను రూపొందించేలోగా ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే కొన్ని మార్పులు సాధ్యమేనని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: