సార్వత్రిక ఎన్నికలు పూర్తయి నాలుగు నెలలు గడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే కాదు... ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలవుతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన తెలంగాణలోనూ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. మోడీ మానియాతో ఢిల్లీలో పీఎం పీఠాన్ని, కేసీఆర్ హవాతో తెలంగాణలో సీఎం సీటునూ కోల్పోక తప్పలేదు. అంతా జరిగి, అందరూ మరిచిపోయిన తర్వాత... ఇప్పుడు ఏఐసీసీ నేతలు మేల్కొన్నారు. తాజాగా తెలంగాణలో పార్టీ ఓటమి పై కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఓటమి పై కారణాలను విశ్లేషించనున్నారు. ఇవాళ, రేపు అంటే 24, 25 తేదీల్లో హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ కార్యాచరణ సదస్సు జరపనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ఇందులో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంను ప్రకటించినా ఇక్కడ కాంగ్రెస్ ఓడిందనే కారణాలతోపాటు రాష్ట్రంలో భవిష్యత్తు కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని దిగ్విజయ్ తెలిపారు. కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులోనే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే సదస్సు నిర్వహణకు ముందు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తే బాగుంటుందన్న నేతల అభిప్రాయాన్ని దిగ్విజయ్ తోసిపుచ్చారు. ఇప్పటికే నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా అక్కడి నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించామని దిగ్విజయ్ రాష్ట్ర నాయకులకు గుర్తు చేశా రు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మెదక్ ఎంపీ స్థానంలో విజయం, అభ్యర్థి ఎంపిక పైనా ఈ సందర్భంగా దిగ్విజయ్ దృష్టి సారించారు. ఇదే అంశం పై మెదక్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే గెలుపు అవకాశాలున్న ఒక్క పేరునే సూచించమని దిగ్విజయ్ కోరినా... కాంగ్రెస్ నాయకులు మాత్ర నాలుగైదు పేర్లు ఆయన ముందుంచారు. వాళ్లూ, వీళ్లు అని తేడా లేకుండా సమావేశానికి వచ్చిన నాయకులంతా పోటీకి తాము సిద్ధమేనని చెప్పారు. మారని తీరుకు అద్దం పట్టే ఇలాంటి ఘటనలెన్నో దిగ్విజయ్ కి తాజాగా ఎదురయ్యాయని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: