కేంద్రంలో మతతత్వ బిజెపి, రాష్ట్రంలో హామీలిచ్చి అమలు చేయకుండా చేతులెత్తేసిన టిడిపిల పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదని ఎపి పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. కేంద్రంలో హమారా సర్కార్, మోడీ సర్కార్ అంటూ ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్, విహెచ్‌పి, శివసేనలు చెప్పుకోవడంలోనే కేంద్రంలో మతతత్వ పాలన జరుగుతోందనే వాస్తవం కనిపిస్తోందన్నారు. మోడీ సర్కార్ నెలరోజుల పాలనలోనే 14.5 శాతం రైల్వేచార్జిలు ప్రయాణికులపై పెనుభారం మోపిందన్నారు. బిజెపి ఎన్నికల ముందు చేసిన ప్రచారానికి ప్రస్తుతం అవలంభిస్తున్న తీరుకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 130 ఏళ్ళ ఘనచరిత్ర ఉందని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఆడిపోసుకోవడం తప్ప తమ గురించి చెప్పుకునే గొప్ప విషయాలు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావడమే పరమావధిగా ఎన్నికల ముందు 250 వాగ్దానాలు చేశారన్నారు. రైతులకు రుణమాఫీ కోసం రూ.87వేల కోట్ల భారం మోస్తామని డ్వాక్రా మహిళల కోసం రూ.14వేల కోట్లు భరిస్తామని హామీలిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి తొలి సంతకం వ్యవసాయ, డ్వాక్రా రుణాల రద్దుపై పెట్టి మూడు నెలలు దాటినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచిన చంద్రబాబు అమలు చేస్తే ఖజానా ఖాళీ అవుతుందనే భయంతో దాని జోలికి పోకుండా మోసగించారని, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదని విమర్శించారు. అపారమైన అనుభవం కలిగిన ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉండగా వారందరినీ కాదని ఎటువంటి రాజకీయం అనుభవంలేని, కనీసం ఎమ్మెల్యేగాని, ఎమ్మెల్సీ కూడా కాని విద్యాసంస్థల అధినేతకు మంత్రి పదవి కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పుకున్న టిడిపి ఆ వర్గం నుండి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేక పోయిందన్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి రామచంద్రయ్య మాట్లాడుతూ కడప జిల్లాలో ఆ పార్టీకి ఒక్క సీటే దక్కడంతో జిల్లా అభివృద్ధిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ఎ సాయిప్రతాప్, రాష్ట్ర మాజీమంత్రి ఎస్‌ఎండి అహ్మదుల్లా, ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, సుధాకర్‌బాబు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: