తెలంగాణ సీఎంగా గద్దె ఎక్కీఎక్కగానే కేసీఆర్ కూల్చివేతలపై దృష్టిసారించారు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. గురుకుల్ ట్రస్టు భూముల్లోని నిర్మాణాలతో మొదలైన... ఆ తర్వాత క్రమంగా నగరమంతా పాకాయి. రోజూ ఏదో ఓ చోట అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. ఆ తర్వాత ఎందుకో గానీ.. కూల్చివేతలు నెమ్మదించాయి. కొన్ని రోజులుగా కూల్చివేతల జాడ కనిపించలేదు. తాజాగా మరోసారి హైదరాబాద్ లో కూల్చివేతలు మొదలయ్యాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. బిట్స్ పిలానీ, అంబేద్కర్‌నగర్, ఫరాకాలనీ, అంబేద్కర్‌నగర్ చెరువు ఎఫ్‌టీఎల్ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దాదాపు 50 కట్టడాలను కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలను, చెరువు ఎఫ్‌టీఎల్ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదంటున్నారు. ఈ కూల్చివేతలకు ఓ దిన పత్రికలో వచ్చిన కథనాలే కారణం కావడం విశేషం. జవహర్ నగర్లో... ఆర్మీ వారికి కేటాయించిన భూములను కొందరు ఆక్రమించుకుని ప్లాట్లుగా అమ్ముతున్నారు. ఇక్కడి ప్రభుత్వ భూముల వివరాలతో కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామంటున్న అధికారులు.. ఇప్పటికే నలుగురిపై ప్రభుత్వ కేసులు పెట్టామని తెలిపారు. జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోనే హెచ్‌ఎండీఏకు చెందిన దాదాపు రెండు వేల ఎకరాలు న్యాయ వివాదాల్లో, ఆరొందలు ఎకరాలు కబ్జాలో ఉన్నట్టు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: