జాతీయ అజెండాను నిర్దేశించేది తామేనని ఇటీవలి కాలం వరకు మీడియా భ్రమల్లో మునిగితేలుతుండేది. నేడు కేంద్రస్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వాలు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల తమ సామర్ధ్యానికి గడగడలాడిపోవలసిందేనన్న భ్రమల్లో నిండా మునిగి తేలాయన్న మాట వాస్తవం. అయితే 2014 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలు వాటిల్లో అప్పటివరకు గూడుకట్టుకొని ఉన్న అహంకారాన్ని ఒక్కసారిగా దెబ్బతీసాయి. తాము ప్రచారం చేసిన అంశాలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమైంది. మీడియా ఉండినా, లేకపోయినా ప్రజలు తమ ఆత్మ ప్రబోధానుసారమే వ్యవహరిస్తారన్న సత్యం ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. మీడియా అధికారంలో ఉన్నవారిని తల్లక్రిందులు చేయగలదన్నది ఒకనాటి మాట. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు మీడియా కింగ్‌మేకర్‌గా వ్యవహరించిందన్న మాట వాస్తవం. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసిపారేసే తరుణం కాదిది. వివిధ సంపాదకులు, యాంకర్లు భావిస్తున్నదానికంటే, ప్రజలు అధికమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కొనసాగినన్నాళ్ళు నరేంద్ర మోదీని హిట్లర్, ముస్సోలిని, ఏకపక్షపాతి, పక్షపాత రాజకీయ వేత్త అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి, ఈ ప్రచారం ఏమీ పనిచేయలేదన్న సంగతి స్పష్టమైంది. ఈ ఎన్నికల ఫలితాల దెబ్బకు బిత్తరపోయింది ముఖ్యంగా జాతీయ మీడియా. అప్పటి వరకు భరించలేని స్థాయిలో వ్యతిరేక ప్రచారం సాగించింది ఈ మీడియానే! ఇక మోదీ విషయానికి వస్తే జాతీయ ప్రధాన స్రవంతిలోని మీడియాను తగినంత దూరంలోనే ఉంచారు. మీడియా ఎల్లవేళలా సెనే్సషనల్ వార్తలకోసం అంగలారుస్తుండటం సహజం. పేజీలన్నీ వార్తలతో నిండాలంటే, ఏదో ఒక విషయం ఉండి తీరాలి. మరి తీవ్రమైన ఆకలి బాధతో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంటాడు? అందుబాటులో ఉన్నదాన్ని బోంచేస్తాడు. అందువల్లనే టెండూల్కర్ పార్లమెంట్‌కు రాకపోయినా వార్తే. టెండూల్కర్ గైర్హాజరీ వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో విఘాతం ఏర్పడిందన్న స్థాయిలో ప్రచారం! రాహుల్ గాంధీ పార్లమెంటులో కునికిపాట్లు పడ్డా అదో కొంపలుముంచుకుపోతున్న వార్త! పార్లమెంట్ బయట రాహుల్ ఏదైనా పసలేని వ్యాఖ్య చేసినా, దానిపై నిరంతర చర్చలు. ఏవిధంగా చూసినా ప్రమాదకరంగాని ఎయిర్‌టెల్ ప్రకటన మహిళల భావోద్వేగాలపై ప్రైమ్‌టైమ్‌లో ప్యానల్ చర్చల్లో చోటు చేసుకుందంటే ఏమనాలి? మాల్‌లోని ప్లే జోన్‌లో ఒక తెల్లని పిల్లను ఆడుకోవడానికి అనుమతించకపోవడం కూడా బ్రేకింగ్ న్యూసైపోయింది! మహిళల వస్తధ్రారణ హుం దాగా ఉండాలంటూ ఒక ఎంపి విజ్ఞప్తి చేసిన పాపానికి ఆయన్ను నానా యాగీ చేశారు. ఇక ఆధునిక మహిళలు టెలివిజన్ స్టూడియోల్లో ప్రత్యక్షమై..ఆయన చేసినవి ‘‘సెక్సిస్ట్ రిమా ర్క్’’లు తప్ప మరోటి కావంటూ ఒకటే గగ్గో లు. వీరంతా ఎవరిని రక్షిస్తున్నారు? శ్రామిక మహిళలను లేదా అన్ని తరగతులకు చెందిన గృహిణులను కాదు. దిగువ, దిగవ మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి మహిళల వస్త్ర ధారణ చాలా హుందాగా ఉంటుంది. అందువల్ల వారు రక్షణగా మాట్లాడేది వీరిని గురించి కాదు. మరి ఎవరి గురించి? సామాజిక కట్టుబాట్లను దూషిస్తూ ‘‘నా శరీరం..నాయిష్టం’’ అనే నినాదాలు చేసే అతి తక్కువ సంఖ్యలోని మహిళలను! మీడియాలో కొనసాగుతున్న ఈ అనారోగ్య వ్యవహార శైలిని నరేంద్ర మోదీ బాగా అధ్యయనం చేశారు. అందుకనే దాన్ని ఎక్కడ ఉంచాలో..అక్కడే ఉంచారు. మీడియా ప్రభువులకు విదేశీ విందులు, ప్రత్యేక సదుపాయాలు బంద్. తప్పనిసరైతే తప్ప ప్రత్యేక ఇంటర్వ్యూల ప్రసక్తే లేదు. అనవసర వివరణలకు స్వస్తిపలికారు. ప్రస్తుతం ఢిల్లీ మీడియా టిఆర్‌పిఎస్‌ల కోసం పరుగులు పెట్టాల్సి వస్తున్నది. పసలేని, నిస్సారమైన వార్తలు ప్రస్తుతం ‘‘బ్రేకింగ్ న్యూస్’’ లేదా ‘‘ప్రధాన శీర్షికల్లో’’ చోటు చేసుకోవడానికి కారణం ఇదే. ఉదాహరణకు పార్లమెంట్ కారిడార్‌లో ఎల్‌కె అద్వానీ, రాహుల్ గాంధీ ముచ్చటించుకున్నారనుకోండి. ఇంకేం..వీరిద్దరూ నరేంద్ర మోదీకి ఎసరు పెట్టడానికి గూడుపుఠాణి నడుపుతున్నారంటూ కథనాలే కథనాలు..! కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరైనా నరేంద్ర మోదీతో ఒకే వేదికను పంచుకోవడానికి తిరస్కరించారనుకోండి. ‘‘మోదీ సమావేశాలను బహిష్కరించనున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు’’ అంటూ మళ్లీ బ్యానర్ వార్తలు. బిఎస్‌ఎఫ్ జవాను సింధూ నదిలో కొట్టుకుపోయినప్పుడు జాతీయ మీడియా చేసిన హడావిడి అంతా యింతా కాదు. ఖర్మం కాలి ఆ బిఎస్‌ఎస్ జవాన్‌ను పాక్ సైన్యం మనకు తిరిగి అప్పగించడం ఏదైనా కారణాల వల్ల గంట ఆలస్యమయ ఉంటే.. మన జాతీయ చానళ్ల ప్రసారాల తమాషాను చూస్తేకాని తనివి తీరదు. పాకిస్తాన్ దుష్ట రాజకీయాలు చేస్తున్నదంటూ హోరెత్తిపోయేది! దీనిపై ఇంతకు మించి సెనే్సషన్ సృష్టించడం సాధ్యంకాదు మరి! మరి మీడియాను తగిన దూరంలో ఉంచడం వల్ల ఏర్పడిన శూన్యతను సోషల్ మీడియా భర్తీ చేయడం విశేషం. ఈ మీడియా విస్తృతి ఎంతగా పెరిగిపోయిందంటే... ట్విట్టర్ అకౌంట్ లేనివాడు సామాజిక సామర్ధ్యం కలిగిన వ్యక్తిగా పరిగణించని కాలం వచ్చేసింది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ www.mygove.nic.in అనే ఒక వెభ్‌సైట్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సామాజిక, ఆర్థిక కార్యక్రమాపై సలహాలు, సూచనలను నేరుగా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే కాదు ప్రజల నాడిని తెలుసుకోవడానికి ఆయన ఎంఎస్‌ఎంలపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. నేరుగా ప్రజలతో సంబంధాలను కలిగివుండే విధంగా దగ్గరి మార్గాలను ప్రభుత్వం ఎంచుకోవడాన్ని మీడి యా ప్రముఖులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంఎస్‌ఎం కూడా ఈ సరికొత్త సంక్షోభాన్ని గ్రహించే లోపునే, ట్రాయ్ మరో పిడుగులాంటి సరికొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. ఇవి అమల్లోకి వస్తే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న చాలా చానళ్లు తట్టాబుట్టా సర్దుకోక తప్పదు. రాజకీయ పార్టీలు, మత సంస్థలు, ప్రభుత్వం నిధులు సమకూర్చే సంస్థలు ప్రసార మరియు పిం పణీ వ్యాపారంలోకి ప్రవేశించకూడదని ట్రాయ్ భావిస్తున్నది. తమిళనాడులో చిన్నాపెద్దా రాజకీయ పార్టీలన్నీ తమకంటూ ప్రత్యేక ఛానళ్లను నడుపుతున్నాయి. ఇక తమ మతపరమైన బోధనలను ప్రసారం చేసుకునేందుకు వివిధ మతాలకు చెందిన వారు ప్రత్యేక ఛానళ్లను నడుపుతున్నారు. ఇక కేబుల్ పంపిణీ పరిశ్రమను జాతీయం చేయడంలో తమిళనాడు ముందంజలో ఉంది. అటువంటి సంస్థలన్నీ మీడియాలో భాగస్వాములు కావడాన్ని నియంత్రించడమే కాకుండా, ఈ చట్టం అమ ల్లో ఉన్నంతకాలం అవి మీడియా వ్యాపారంలోకి ప్రవేశించడానికి అనర్హులను చేయాలని ట్రాయ్ కోరుతోంది. ట్రాయ్ ఉద్దేశాలు చాలా ఉదాత్తమైనవి. మరి ట్రాయ్ సలహాలను, సూచనలను అమలు పరచే ధైర్యసాహసాలు ఏ ప్రభుత్వానికైనా ఉన్నాయా? ఆవిధంగా అమలు జరిపితే దేశంలోని చాలా చానళ్లు మూతపడటం ఖాయం. ఇదే సమయంలో ఒక ప్రశ్నకూడా ఉత్పన్నవౌతుంది. ఆవిధంగా చేయడం వల్ల రాజ్యాంగంలోని 191(ఎ) అధికరణం ప్రసాదిస్తున్న స్వేచ్ఛ రాజకీయ పార్టీలు లేదా మత సంస్థలకు వర్తించదా? అది అట్లా ఉంచి, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కొని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింహంలాగా గర్జిస్తున్న మీడియా చివరకు ఒక గొర్రెపిల్ల మాదిరిగా వ్యవహరిస్తోంది. లేకపోతే ఎంఎస్‌ఓల తెలంగాణ రాష్ట్ర సమాఖ్యకు ఒక ఛానల్ క్షమాపణ చెబుతుందని మీరు ఏవిధంగా ఊహించగలరు? సదరు ఛానల్ ఎంఎస్‌ఓస్‌కు ఒక లేఖ రాస్తూ ‘‘మేం మీ సంఘానికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం దయచేసి మా ఛానల్ ప్రసారాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రండి’’, అంటూ ఒక మీడియా హౌజ్..ఈ విధంగా ఒక ప్రభుత్వేతర, మీడియాలోవచ్చే వార్తాంశాలతో ఏమాత్రం సంబంధంలేని ఒక సంస్థవద్ద కాళ్ల బేరానికి రావడం నిజంగా భారత మీడియా చరిత్రలో ఇదే మొదటిసారి! ఈ ఎంఎస్‌ఓలు హైదరాబాద్ నగరంలో తప్ప, మొత్తం తెలంగాణ జిల్లాల్లో ఈ ఛానల్ సిగ్నల్స్ ప్రసారం కాకుండా నిలిపివేసాయి. దీనిపై పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు. చిన్న చిన్న విషయాలకు చొక్కాలు చింపుకునే జర్నలిస్టులు దీనిపై నోరుమెదపకపోవడం విచిత్రం. ఈ సమస్య పార్లమెంట్‌లో కూడ ప్రస్థావనకు వచ్చింది. కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఈ సమస్య విషయంలో కలుగజేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని లేవనెత్తిన ఫలితంగా సదరు ఛానల్ సిఈఓను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలేవీ జాతీయ మీడియాకు పట్టవు. కానీ మోడీ తలపాగా చినిగిందని లేదా ఆయన ప్రసంగం లేదా మోహన్ భగవత్ హిందూ అజెండా ఊహాగానంపై మాత్రం రంధ్రానే్వషణ వార్తలను ప్రసారం చేయడానికి ఈ మీడియాకు క్షణం తీరుబడి ఉండదు! తమిళనాడులో భారతీయ స్టేట్ బ్యాంక్ అధికార్ల సంఘం (ఎస్‌బిఒఏ) ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలలను ఏకమొత్తంగా క్రైస్తవంలోకి మార్చిపడేశారు. అదేమంటే తప్పుడు దేవుళ్లను ఆరాధిస్తున్న వీరిని రక్షించడానికే ఆవిధంగా చేశామనేది సమాధానం. అయితే అన్నానగర్‌కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు ఈప్రమాదకరమైన పరిణామాన్ని వ్యతిరేకించడమే కాకుండా హిందువుల ప్రార్థనాగీతాన్ని ఆలాపించినందుకు ఆమెను తక్షణమే ఉద్యోగంలోంచి పీకేశారు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఒంటికాలిపై లేచే మహిళా సంఘాలవారు పాపం సాటి స్ర్తికి జరిగిన ఈ అన్యాయంపై మొసలి కన్నీరు కార్చారే తప్ప, అదేమని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఈ ఎస్‌బిఒఏ పాఠశాలలకు నిధులు సమకూర్చేది భారతీయ స్టేట్ బ్యాంకు. మరి ఈ సామూహిక మతమార్పిడులను ఏవిధంగా అనుమతించారు? మరి ఇదంతా తాము సెక్యూలరిస్టులమంటూ బొర్రలు విరుచుకొనే జాతీయ మీడియాకు కనీసం ఒక వార్తగానైనా కనిపించలేదా? ఎప్పుడూ స్వధర్మానికే కట్టుబడే మీడియాలో దీనిపై చర్చలు కాదుకదా, చిన్న వార్తకూడ ప్రసారం కాలేదు! పై పరిణామాలన్నింటిని పరిశీలిస్తే మీడియా తన ‘అతి ప్రవర్తన’ కారణంగా తన పట్టును కోల్పోతున్నదని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: