కుమ్ములాటలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. అది గల్లీలో పెట్టుకునే చిన్న మీటింగ్ అయినా... ఢిల్లీ స్థాయిలో జరిగే పెద్దల సమావేశమైనా... అంతో ఇంతో రచ్చ జరగడం అక్కడ కామన్ విషయమే. తాజాగా తెలంగాణలో జరిగిన అంతర్మథన సమావేశం సైతం అలాంటి రచ్చ రంబోలాలతోనే సాగింది. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ప్రణాళిక లక్ష్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తలపెట్టిన రెండురోజుల మేధోమథన సదస్సులో మొదటిరోజు కార్యకర్తలు, నేతల నిరసనలు మిన్నంటాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఈ సదస్సు సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఐక్యత, క్రమశిక్షణ కొరవడిందని మరోసారి బహిర్గతమైంది. సమన్వయపర్చాల్సిన నేతలే గొడవకు దిగడం ఈసారి మరో కొసమెరుపు. రాష్ట్రం ఇచ్చినా ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించలేదనే బాధ ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు మొదలుకొని రాష్ట్ర నేతల వరకూ అందరూ వాపోయారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై నేతలంతా అనేక అంశాలను ఏకరువు పెట్టారు. అయితే టీపీసీసీ చీఫ్ పొన్నాల ప్రసంగానికి నేతలు పదే పదే అడ్డుపడుతూ నిరసనగా నినాదాలిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఎంపీ వీ హనుమంతరావు మధ్య మాటల యుద్ధం జరుగగా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని మార్చడంతో మాజీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా జిల్లా నేతలు ఈ సదస్సుకు డుమ్మాకొట్టారు. సదస్సు మొదట్లోనే కార్యకర్తలతో మాట్లాడించాలని వీహెచ్ ప్రతిపాదించారు. దీన్ని దిగ్విజయ్‌సింగ్ తో వ్యతిరేకించారు. అయినా వీహెచ్ పట్టుబట్టడంతో దిగ్విజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిదాన్నీ వివాదం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన ఘటనపై కూడా వీహెచ్‌ను నిలదీశారు. వీహచ్ కూడా గట్టిగా జవాబివ్వడంతో సదస్సు ఓ దశలో కాస్త వేడెక్కింది. వీహెచ్, పొన్నాల మధ్య విభేదాలు కూడా సభ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పక్కనే కూర్చోవటానికి వచ్చిన హనుమంత రావును పొన్నాల అడ్డుకున్నారు. మరో సీట్లో కూర్చోబెట్టారు. దీంతో వీహెచ్, పొన్నాలపై అప్పటికప్పుడే నిరసన వ్యక్తంచేశారు. మరోసారి సదస్సులో టీపీసీసీ చీఫ్ పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారివల్లే పార్టీ ఓటమి పాలైందని నల్గొండ, ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యకర్తలను పట్టించుకోకపోవటం వల్లే పార్టీ ఓడిందని, ఇప్పటికైనా అధిష్ఠానం కళ్లు తెరువకపోతే భవిష్యత్తులో పార్టీ మరింత నష్టం జరుగుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఆరోపించారు. తర్వాత మరో కార్యకర్త లేచి పొన్నాలతోపాటు కార్యవర్గాన్ని మార్చి పార్టీని పటిష్ఠ పర్చాలని సూచించారు. కార్యకర్తల్లో ఆవేశం ఎక్కువ అవుతున్న దశలో దిగ్విజయ్‌సింగ్ కల్పించుకుని సమస్యలు సృష్టిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. స్టేజీ పై ఉన్న నేతలు, కిందున్న కార్యకర్తలు అందరికీ ఈ రచ్చ కామన్ విషయమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: