నాలుగు రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హవా కొట్టుకుపోయింది. ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక నాలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ పనితీరుపై ఇదో లిట్మస్ టెస్ట్ అని, ప్రజలకు మోడీ సర్కారుపై విశ్వాసం లేదని ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని విపక్షాలు అప్పుడే ఫైర్ అవుతున్నాయి. బీహార్-లో 10, పంజాబ్-లో 2, మధ్యప్రదేశ్-లో 3, కర్నాటకలో 3 స్థానాలకు గతవారం జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్రపక్షాలే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. మాజీ కేంద్రమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి పాటియాలా రాజ కుంటుంబీకులు ప్రణీత్-కౌర్ పాటియాలా 23 వేల ఓట్ల మెజార్టీతో పాటియాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. రూలింగ్ అకాలీదళ్ అభ్యర్థి తల్వండి సాబో సీట్-ను జీత్ మోహిందర్ సింగ్ సిధు దక్కించుకున్నారు. బీజేపీ కంచుకోట అయిన కర్నాటకలోని బళ్లారి రూరల్ నియోజకవర్గంలో పాతికవేల ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పాగా వేయడం హైలైట్. శికారిపురా నుంచి యడ్యూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర విజయం సాధించారు. బళ్లారి రూరల్, చిక్కోడి-సబల్ రెండూ కాంగ్రెస్ సొంతం చేసుకోగా కర్నాటక కాంగ్రెస్-లో సంబరాలు అంబరాన్నంటాయి. అంటే కర్నాటకలో మోడీ హవా లేదని అర్థమంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలు మోడీ సర్కారుకు చెంపపెట్టులాంటివని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 90 రోజులకే మోడీ సర్కారు ప్రజలకు దూరమైందన్నదే వీటి సారాంశమని మనీష్ తివారీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్-లో మూడు బైపోల్స్-లో రెండు బీజేపీ గెలుచుకోగా ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది. అగర్ అసెంబ్లీ స్థానాన్ని గోపాల్ పర్మార్ సొంతం చేసుకోగా విజయరాఘవఘర్-లో మరో బీజేపీ నేత సంజయ్ పాథక్ విజయ బావుటా ఎగురవేశారు. ఇక బహోరిబంద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కన్వర్ సౌరభ్ సింగ్ విజయం సాధించారు. ఇక బీహార్-లో కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ మహాకూటమి ఆరు స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ 3, జనతాదళ్ యునైటెడ్ 2, కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: