జగన్ పార్టీ వైఖరి చూస్తుంటే.. ఇక వైకాపా తెలంగాణపై ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకుని.. మొదట్లోనే తెలంగాణలో అవకాశాలు గండికొట్టుకున్న ఆ పార్టీ.. ఎన్నికల తర్వాత కూడా అదే తరహా వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా.. తెలంగాణలో జరిగే మెదక్ ఉప ఎన్నికపై ఆ పార్టీ దృష్టిపెట్టడం లేదు. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడే... ఇంకా ఆ విషయం గురించి అంతగా ఆలోచించడం లేదు. ఏపీ అసెంబ్లీ సమావేశాలపైనే దృష్టిపెట్టామని కామెంట్ చేయడం విశేషం. మెదక్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ బరిలో దిగకపోతే.. ఇక ఆ పార్టీ తెలంగాణలో దాదాపుగా జెండా పీకేసినట్టే.. ఇప్పటికే జగన్ పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కేవలం ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే ఆ పార్టీకి ఒక ఎంపీ, మరో మూడు ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. పార్టీ వైఖరి చూసి వారు కూడా గులాబీ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీ నిర్మాణంపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టలేదు. కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్ వంటి వారు పార్టీ నుంచి నిష్క్రమించిన తర్వాత పార్టీ దాదాపుగా కనుమరుగైపోయింది. దాన్ని పునరుద్దరించే ఆలోచన కూడా జగన్ కు ఉన్నట్టు కనిపించడం లేదు. గతంలో పార్టీ తెలంగాణ బాధ్యతలు జగన్ సోదరి షర్మిలకు అప్పజెబుతున్నామన్నారు. ఈ మేరకు జగనే స్వయంగా ఓ ప్రకటన కూడా చేశారు. ఎలాగూ పార్టీ అభిృద్ధికి అవకాశం లేని ఏరియా తనకెందుకనుకున్నారో ఏమో కానీ.. షర్మిల ఆ బాధ్యతలు స్వీకరించలేదు. ఎన్నికల సమయంలో తెలంగాణలో పర్యటించిన షర్మిల.. ఎన్నికల తర్వాత ఇటువైపు కూడా తిరిగి చూడలేదు. పార్టీ అధినేతల నిర్లక్ష్యం చూసిన కార్యకర్తలు.. వైఎస్ పై ఉన్న అభిమానాన్ని పక్కకుపెట్టి.. ఒక్కొక్కరుగా పార్టీలు మారుతున్నారు. డైరెక్టుగా ప్రకటిస్తే బావుండదనుకున్నారో ఏమో కానీ... ప్రస్తుత పరిస్థితి చూస్తే.. వైకాపా తెలంగాణలో జెండా పీకేసినట్టే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: