అనుకున్నదంతా అయ్యింది.. ఆర్బీఐని ఒప్పిస్తాం.. రుణాల రీ షెడ్యూల్ సాధిస్తామన్న తెలుగుదేశం నేతల హామీలు నీటిమూటలే అయ్యాయి. మొత్తం ఏపీలోని 13 జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాలకు మాత్రమే రుణాలు రీషెడ్యూల్ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ ఏపీకి తేల్చి చెప్పేశారు. మిగిలిన జిల్లాలపై ఇంకా ఆశలు పెట్టుకోనవసరంలేదని కూడా స్ఫష్టం చేశారు. కనీసం ఆ ప్రతిపాదనలను ఇక ముందు పరిశీలించే ప్రసక్తి కూడా లేదని కుండబద్దలు కొట్టారు. అంటే కేవలం 4 జిల్లాల రైతులకే రుణాలు రీషెడ్యూల్ ఉంటుందన్నమాట.. రుణాల రీషెడ్యూల్ విషయంపై మాట్లాడేందుకు ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్వయంగా ఢిల్లీ వెళ్లారు. రఘురాంరాజన్ తో భేటీ అయ్యారు. రుణమాఫీ చేయమని తాము అడగడం లేదని...కనీసం రీషెడ్యూల్ చేయమని మాత్రమే అడుగుతున్నామని ప్రాధేయపడినంత పని చేశారు. కృష్ణారావు ప్రతిపాదనల పట్ల రఘురాంరాజన్ ఏమాత్రం కరుణించలేదు. తాము సహకరించినందువల్లనే నాలుగు జిల్లాల్లో రీ షెడ్యూల్ చేస్తున్నామని.. అంతకుమించి సాయం చేయలేమని రాజన్ చేతులెత్తేశారు. అంతే కాదు.. అసలు రుణమాఫీ అనే ప్రతిపాదనే అర్థరహితమైందని.. అది సాధ్యమయ్యే పని కాదని కృష్ణారావుతో అన్నారట. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలతో జరిగిన సమావేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ రుణమాఫీపై అందరికీ క్లాసు తీసుకున్నారట. రుణమాఫీకి తాను వ్యతిరేకమని స్పష్టంగా ప్రకటించారట. పార్టీలు, ప్రభుత్వాలు రుణమాఫీ వంటి ఆకర్షణీయమైన మంత్రాలతో ఓట్ల కోసం కక్కుర్తిపడితే.. బ్యాంకలు ఎలా బతకాలని నిలదీశారట. అసలే బ్యాంకింగ్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటూ దేశానికి సేవలందిస్తోందని.. దాన్ని ఇలాంటి ఓట్ల పథకాలతో దెబ్బతీయవద్దని సూచించారట. 4 జిల్లాలకే రీషెడ్యూల్ అని ఆర్బీఐ తేల్చి చెప్పేయడంతో ఇక ఏపీ సర్కారు సొంత నిధులతోనే మిగిలిన 9 జిల్లాల్లో రుణమాఫీ అమలు చేయాల్సి ఉంటుంది. మరి అంత సొమ్ము చంద్రబాబు ఎలా సేకరిస్తారన్నిది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: