ఇప్పుడు అవకాశం దొరికింది... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటే జగన్ పై శాశ్వతంగా ఆ ముద్ర పడిపోతుంది.. ఆ తర్వాత ఎవరేం చేసినా ఆ ముద్ర చెరిగిపోదు.. అందుకే వీలైనంతగా ఇప్పుడే ప్రయత్నిద్దాం... జగన్ ను ఒక విలన్ గా చేసేద్దాం... అనే వ్యూహంతో సాగుతోంది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు బడ్జెట్ గురించి చర్చించడానికి ఏర్పాటు చేసినవే అయినా... ఇప్పుడు చర్చ జరుగుతున్నది, ఫోకస్ అవుతున్నది జగన్ గురించి మాత్రమే! ఒక్క విషయం అయితే నిజం.. ఇప్పుడు స్పీకర్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విమర్శలు చేస్తుందో.. అవన్నీ మన వ్యవస్థకు కొత్త కాదు. ఇది వరకూ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తులపై ఇంతకన్నా అనుచితమైన వ్యాఖ్యానాలు వినిపించాయి. వారిని వ్యక్తిగతంగా, రాజకీయంగా అనేకరకాలుగా విమర్శించాయి ప్రతిపక్ష పార్టీలు. అలాంటి ప్రతిపక్షాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీనే! కిరణ్ కుమార్ రెడ్డి విషయంలోనైనా, నాదెండ్ల మనోహర్ పైనైనా తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అసహనంతో రగిలిపోయారు అప్పట్లో తెలుగు తమ్ముళ్లు. అధినేత చంద్రబాబు స్పీకర్ తో అనేక సార్లు వాగ్వాదానికి దిగారు. "మీరు నాకు చెప్పేటంతటి వాళ్లా..?' అని వ్యాఖ్యానించాడాయన! మరి స్పీకర్ ను వ్యక్తిగతంగా కాకపోయినా... ఆ కూర్చిలో కూర్చొన్నందుకు అయినా గౌరవించాలన్న విషయాన్ని మరిచిపోయినట్టుగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో వైకాపా అధినేత ఒక్క మాట ఎక్స్ ట్రాగా మాట్లాడటంపై నాలుగైదు రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది! అధికార పార్టీ సభ్యుల్లో ఒకరేమో అసెంబ్లీలో బాంబులేస్తారేమో అని అంటున్నారు.. మరొకరు రాయలసీమకు వెళ్లి రౌడీయిజం చేసుకోపోండి అంటూ ప్రతిపక్ష పార్టీకి సూచిస్తారు.. ఇవేమీ అర్ధరహితంగా మాట్లాడుతున్న మాటలు కాదు. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్న మాటలు. ప్రతిపక్ష పార్టీది రౌడీయిజం అని చెప్పడానికి అధికార పక్షం ప్రయత్నిస్తోంది. మరి ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: