కాంగ్రెస్ నేతల కామెడీతో పేపర్లు నిండిపోతున్నాయి...ఒకవైపు తెలంగాణ వాళ్లు.. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు.. ఇలా రెండు వైపుల నుంచి తెలుగు ప్రజలను నవ్విస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ... ఎలాగైనా ఆ ఓటమిని తక్కువ చేసే పనిలో ఉంది. సమీక్షల పేరుతో తమ ఐక్యమత్యాన్ని చాటి.. తాము కోలుకొన్నట్టుగా కనిపించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో ఇలాంటి ప్రయత్నాలు చేయగా.. అవి షాక్ కొట్టిన ఫీలింగ్ ను ఇచ్చాయి. పార్టీ నేతలు తమ చిల్లర చిల్లర గొడవలన్నింటినీ ఆ వేదికపై ప్రస్తావించారు. మొత్తంగా సమీక్షా సమావేశం అల్లకల్లోలంగా మారింది. నేతల మధ్య వైరుధ్యాలు అన్నీ బయటపడిపోయాయి. కాంగ్రెస్ పార్టీప్రస్తుతానికి ప్రధాన పక్ష హోదాలో ఉంటే ఉండొచ్చునేమో కానీ.. భవిష్యత్తులో ఈ పార్టీ కోలుకొంటుందనే నమ్మకాన్ని కాస్తా పోయేలా చేసింది ఆ సమీక్ష సమావేశం! ఇక తెలంగాణ నేతల సంగతి ఇలా ఉంటే.. అవతల రఘువీరారెడ్డి ని పట్టేకి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడ్రస్ లేకుండా పోయినా.. రఘువీరారెడ్డి మాటలకు మాత్రం ఏమీ లోటు లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిరిగి పునరుత్తేజం అయిపోయిందని అంటున్నాడాయన! రెండు రోజుల పాటుమూడో కంటికి తెలియకుండా నిర్వహించిన సదస్సుతో పార్టీ పునరుత్తేజం అయ్యిందని అంటున్నాడాయన! మరి ఇవి నమ్మదగ్గ మాటలేనా? ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు రియాలిటీని ఒప్పుకొనే పరిస్థితుల్లో లేరా?! ఇలాంటి బూటకపు మాటలతో ప్రజలను మోసం చేద్దామనే అనుకొంటున్నారా? ఇలాంటి తీరుతో వారు పార్టీని తిరిగి బలోపేతం చేసుకోగలరా!

మరింత సమాచారం తెలుసుకోండి: