లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీకి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. ఈ నెల 21న బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగగా.. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ కూటమి 8 సీట్లలో విజయం సాధించింది. బీహార్లో దూసుకెళ్తామని భావించిన ఆ పార్టీకి ఆర్జేడీ, జేడీ (యు), కాంగ్రెస్ పార్టీలతో కూడిన లౌకికవాద కూటమి గట్టి షాకిచ్చింది. ఆ రాష్ట్రంలో పది స్థానాలకు ఎన్నికలు జరగగా రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. లౌకికవాద కూటమికి 6 (ఆర్జేడీ 3, జేడీ (యు) 2, కాంగ్రెస్ 1) స్థానాలు దక్కాయి. కంచుకోట మధ్యప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తామని భావించిన బీజేపీకి నిరాశే మిగిలింది. ఇక్కడ మూడు స్థానాల్లో ఎన్నిక జరగ్గా.. ఊహించని రీతిలో కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. ఇక పంజాబ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఒక సీటు గెలుచుకోగా.. కాంగ్రెస్ మరో సీటులో విజయం సాధించింది. కర్ణాటకలోని మూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి దక్కింది ఒక్కటే. మోడీ పాలనపై అసంతృప్తికి సూచిక.. ------------------------------------- అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తికి సూచన అని జేడీ (యు) నేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ మతవాద ఎజెండాను నిలువరించడానికి లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకొనిపోయే దిశగా యోచిస్తున్నామని ఆయన తెలిపారు. కర్ణాటక ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ద్వారా నరేంద్ర మోడీ విజయం తాత్కాలికమని వెల్లడైందన్నారు. కాగా, ఈ ఫలితాలు మోడీ పాలనకు ప్రతీక అనడాన్ని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఖండించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: