బిజెపిలో కొత్తతరం నాయకత్వం వచ్చింది. పాతతరం నాయకత్వానికి ఉద్వాసన పలికింది. బిజెపి వ్యవస్థాపకులు అతల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్‌ జోషిలను ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించారు. బిజెపిలో ఇది అత్యున్నతస్థాయి విధాన నిర్ణాయక సంస్థ. పార్టీ పార్లమెంటరీ బోర్డులో సైతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముద్ర స్పష్టంగా కనిపించింది. తన అనుయా యులతోనే బోర్డును నింపేశారు. బిజెపిలో త్రిమూర్తులుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి, అద్వానీ, జోషిలను పార్లమెంటరీ బోర్డు నుండి తప్పించారు. కొత్తగా ఐదుగురు సభ్యులతో మార్గ దర్శక మండల్‌ను ఏర్పాటు చేశారు. అందులో వారిని సభ్యులుగా నియమించారు. బిజెపి పార్లమెంటరీ బోర్డులోకి కొత్తగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి జెపి నద్దాను తీసుకున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్‌గా బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను నియమించారు. బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీలో ఇద్దరికి చోటు కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. 12 మంది సభ్యులుగా గల పార్లమెంటరీ బోర్డుకు అమిత్‌ షా ఛైర్మన్‌గా వ్యవహరించగా మోడీ, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మా స్వరాజ్‌, వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ, అనంతకుమార్‌, తవర్‌చంద్‌ గెహ్లాట్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జగత్‌ ప్రకాష్‌ నద్దా, రామ్‌లాల్‌ సభ్యులుగా వున్నారు. బిజెపి అగ్రనాయలు, నరేంద్రమోడీతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్పులకు అమిత్‌షా శ్రీకారం చుట్టారు. ఐదుగురు సభ్యుల మార్గదర్శక్‌ మండల్‌లో మోడీ, రాజ్‌నాథ్‌సింగ్‌ సభ్యులుగా వున్నారు. అనారోగ్యం కారణంగా దాదాపు దశాబ్దకాలంగా వాజ్‌పేయి ప్రజాజీవితానికి దూరంగా వున్నారు. గత లోక్‌సభ ఎన్నికల వరకు వాజ్‌పేయి ఎన్‌డిఎ చైర్మన్‌గా వున్నారు. మోడీ శకానికి ముంద అద్వానీ ఎన్‌డిఎ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కొనసాగారు. బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించారు. ఇందులో నుండి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినరుకతియార్‌ను తొలగించారు. ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా వున్న బిజెపి మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు సరోజ్‌ పాండేను తొలగించి ఆమె స్థానంలో ప్రస్తుత మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ రహత్కర్‌ను నియమించారు. 15 మంది సభ్యుల కమిటీలో గిరిజన నేత, కేంద్రమంత్రి జ్యుయల్‌ ఓరమ్‌కు స్థానం కల్పించారు. ఇంకా ఈ కమిటీలో మోడీ, రాజ్‌నాథ్‌, జైట్లీ, సుష్మ స్వరాజ్‌, వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ, అనంతకుమార్‌, తవర్‌చంద్‌ గెహ్లాట్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జగత్‌ ప్రకాష్‌ నద్దా, రామ్‌లాల్‌, షానవాజ్‌ హుస్సేన్‌, రహత్కర్‌ సభ్యులుగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: