పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు మధ్య రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో వర్షాలు వర్షాకాలంలోనూ మండుటెండలతో అలమటిస్తున్న ప్రజానీకానికి సోమవారం కురిసిన వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచీ మంగళవారం వరకూ ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలైనా కాస్త మేలు చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా మెట్‌పల్లిలో111.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలో సోమవారం సాయంత్రంనుంచీ భారీ వర్షం పడింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు, రాజాపేట, చండూరు,కోదాడ, గుండాల, రామన్నపేట తదితర మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు మొక్కజొన్న పంటకు లాభం చేయకపోయినా కంది, పత్తి చేలకు ప్రయోజనం రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి, చుట్టుపక్కల మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలతో రైతులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. మహబూబాబాద్, కురవి, పాలకుర్తి, నెల్లికుదురు, నెక్కొండ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: