చాలా కాలంగా చర్చల్లో నానుతూ వస్తున్న పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పదోతరగతిలో ప్రస్తుతం అమలులో ఉన్న 11 పేపర్ల విధానాన్నే కొనసాగించాలని విద్యా శాఖ నిర్ణయించింది. కాకపోతే తొమ్మిదో తరగతిలో కూడా ఇలాగే 11 పేపర్ల విధానాన్ని అమలు చేసేందుకు మార్పు చేశారు. వీటితోపాటు చేసిన మరికొన్ని సంస్కరణలనూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో నంబర్-2ను తెలంగాణ విద్యాశాఖ జారీ చేసింది. పదో తరగతిలోని అన్ని సబ్జెక్టులకు 100 మార్కులు ఉంటాయి. ఇందులో 80 మార్కులకు రాతపరీక్ష, 20 మార్కులకు అంతర్గత మూల్యాంకనం (ఇంటర్నల్స్) ఉంటాయి. గతంలో మాదిరిగానే హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 40 మార్కులకు పరీక్షా రాయాల్సి ఉంటుంది. హిందీ పరీక్షాపత్రం మాత్రం 80 మార్కులకు ఉంటుంది. అంతర్గత మూల్యాంకనాన్ని కొత్తగా ప్రవేశపెడుతున్నప్పటికీ 80 మార్కుల రాతపరీక్షనే ఉత్తీర్ణత కోసం పరిగణనలోకి తీసుకుంటారు. 80 మార్కుల పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే 28 మార్కులు సంపాదించాల్సి ఉంటుంది. అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులకు ఏడు మార్కులు సాధించాలి. అయితే, ఈ మార్కులు తప్పనిసరికాదు. విద్యార్థి సామర్ధ్యాన్ని అంచనా వేయడం కోసమే అంతర్గత మూల్యాంకనాన్ని ప్రవేశపెడుతున్నారు. గత విద్యా సంవత్సరం వరకు తొమ్మదో తరగతిలో 6 పేపర్లు, పదో తరగతిలో 11 పేపర్ల విధానం అమలులో ఉండేది. తొమ్మిది, పదో తరగతుల్లో తొమ్మిది పేపర్ల విధానం ఉండాలని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 17ను జారీ చేసింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అందులో పలు మార్పులు చేసి ఆమోదించింది. మరోవైపు ప్రైవేటుగా పరీక్షలు రాసే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేవలం నేషనల్ ఓపెన్ స్కూల్ లేదా రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి మాత్రమే పరీక్షలు రాసేందుకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: