భారతదేశం పేదవాళ్లు నివసించే ధనిక దేశం అని తమాషాగా పిలుస్తుంటారు. అవును మరి.. అన్నిరకాల సహజ వనరులతో విలసిల్లే ఈ దేశంలో ఆకలి చావులూ నిత్యం కనిపిస్తాయి. ధనిక, పేద అంతరాలు అడుగడుగునా కనిపిస్తాయి. అంతా మనుషులే అయినా.. సమాజం రెండు జాతులుగా విడిపోయి దర్శనమిస్తుంది. అందుకు అవిద్య, అవినీతి వంటి కారణాలెన్నో. అందుకే పాలనలో పారదర్శకత పెంచాలంటున్న మోడీ.. మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్నదే ఈ పథకం లక్ష్యం. తొలి నాలుగేళ్లలో దేశంలోని ఏడున్నర కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని మోడీ టార్గెట్ ఫిక్స్ చేశారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ పథకం ప్రకారం.. బ్యాంకు ఖాతా లేనివారికి ఉచితంగా ఖాతా ఇప్పిస్తారు. అంతేకాదు.. లక్ష రూపాయల బీమా సదుపాయం కల్పిస్తారు. అది కూడా ఉచితంగానే. ఏటీఎం తరహాలో రూపే అనే కార్డునూ ఖాతాదారుకు అందచేస్తారు. ఇంకో విశేషం కూడా ఉంది. ఉచితంగా కల్పిస్తున్న బీమా ప్రకారం.. ఖాతాదారులు మొదటి వంద రోజుల్లో మరణిస్తే.. రెట్టింపు సొమ్ము అంటే 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. నిరుపేదలు ఎలాంటి సొమ్ము చెల్లించకపోయినా.. బీమా సౌకర్యం పొందవచ్చన్నమాట. దేశ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిచాలన్నదే ఈ పథకం అంతిమ లక్ష్యం. దేశంలో ఎన్నో కోట్ల కుటుంబాలకు మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. కానీ బ్యాంకు ఖాతాలు మాత్రం లేవు. ఈ పరిస్థితిని మార్చాలి. ఆర్థికాభివృద్ధి అనేది పేదలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలి. మోడీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 76 ప్రాంతాల్లో భారీస్థాయిలో ప్రారంభిస్తారు. రాష్ట్ర రాజధానులు, ప్రధాన నగరాల్లో ముఖ్యమంత్రులు కానీ... కేంద్రమంత్రులు కానీ ప్రారంభించనున్నారు. తొలి రోజు కోటి ఖాతాలు తెరిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశంపై ఇప్పటికే బ్యాంకు అధికారులతో సమావేశమైన మోడీ... ప్రతి ఒక్క కుటుంబానికి బ్యాంక్ ఖాతా తెరిపించే బాధ్యత మీదేనని... మీ భుజస్కంధాలపై భారీ బాధ్యతను పెడుతున్నామని చెప్పారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలిరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 60 వేల క్యాంపుల ద్వారా ఖాతాలు తెరిపించాలని బ్యాంకులు నిర్ణయించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: