ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే తమ నోళ్లను అదుపులో పెట్టుకోవాలి..తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం, తమ స్థాయిని మరిచిపోయి మాట్లాడవచ్చు. అవతలి వారి స్థాయిలో ఏమిటో అర్థం చేసుకోకుండా మాట్లాడవచ్చు. అధికారంలో ఉన్నామనే ఏకైక కారణంతో చెలరేగిపోవచ్చు! అవతలి వారికి నీతులు చెబుతూనే.. అవతలి వారు తమను అన్ పార్లమెంటరీ వర్డ్స్ తో కించపరుస్తున్నారంటూనే... నోటికి వచ్చినట్టు మాట్లాడటం మాత్రం తెలుగుదేశం ఎమ్మెల్యేలకే చెల్లుబాటు అవుతోంది! గొల్లపల్లి సూర్యారావు ఎవరో కాదు.. ఆయన గతంలో వైఎస్ క్యాబినెట్ లో పనిచేసిన వ్యక్తే. అప్పట్లో వైఎస్ ను కీర్తించిన వ్యక్తే.. అయితే తర్వాత టర్మ్ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యాడు. ఇప్పుడు గెలిచాడు. తెలుగుదేశం పార్టీ తరపున సభ్యుడయ్యాడు! ఇప్పుడు ఆయన అంటాడు... వైఎస్ ను కొరివిదెయ్యం అని, దుశ్శాసనుడు అని...తన తనివితీరా అసెంబ్లీలో వైఎస్ ను తిట్టి సేదతీరాడు ఈయన. మరి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేలను బఫూన్లు అంటే నే వాళ్లకు అంత కోపం వచ్చింది! దానిపై క్షమాపణలు చెప్పాలని వాళ్లు లొల్లిపెడుతూనే ఉన్నారు. ఇక స్పీకర్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాల గురించి సభా హక్కుల నోటీసులను ఇచ్చింది తెలుగుదేశం! ఇక అసెంబ్లీ అంటే లోటస్ పాండ్ కాదని.. రౌడీయిజం చేయడానికి ఇది కడపకాదనే మాటలకు అయితే కొదవేలేదు! మరి ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే.. టీడీపీ ఏమీ తక్కువ రకం కాదని అర్థం అవుతోంది. జగన్ అన్నది బఫూన్ అనే మాట ఒక్కటే! అయితే తెలుగుదేశం శాసన సభ్యులు ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. ప్రతి నిమిషం వైఎస్ పేరును, జగన్ పేరును తలుస్తూ వాళ్లను తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పష్టంగా అర్థమయ్యే విషయం ఒక్కటే... తెలుగుదేశం పార్టీ సభ్యుల నోటికి హద్దులేకుండా పోతోంది. వాళ్లు తమను తాము కంట్రోల్ చేసుకొనే వరకూ కూడా సభ వారి కంట్రోల్ లోకి రాదు. అయితే సరైన చర్చ జరగాలని తెలుగుదేశం కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే.. చర్చ జరిగితే ప్రభుత్వం ఇరకాటంలో పడిపోతుంది. అందుకే సభాకాలాన్ని ఇలా టైమ్ పాస్ చేస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: