2012లో ‘బొగ్గు బొరియల’ నిండా అవినీతి కీటకాలు గూళ్లు కట్టుకుని ఉన్నట్టు ప్రభుత్వ ఆదాయ వ్యయ ‘నియంత్రణ సమీక్షా మండలి’ వారు బయటపెట్టినప్పుడే డొంక కదలిపోయిన సూచనలు ప్రస్ఫుటించాయి. 2004-2009 మధ్య కాలంలో జరిగిన బొగ్గు బొరియల కేటాయింపులవల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షా ఎనబయి ఆరువేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ‘నియంత్రణ సమీక్షా మండలి’ - కంట్రోలర్ ఆడిటర్ జనరల్ - సిఎజి - వారు 2012 ఆగస్టు 17న జరిపిన నిర్ధారణ! ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పువల్ల నష్టం ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చునన్న భయాందోళనలు చెలరేగుతున్నాయి. 1993 నుండి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బొగ్గు బొరియలు - కోల్ బ్లాక్స్ - అక్రమాలకు ఆలవాలమయ్యాయన్నది సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చెప్పిన తీర్పునకు ఇతివృత్తం!! 1993 నుండీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అక్రమంగా చట్టాలకు విరుద్ధంగా 218 బొగ్గు బొరియలను వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వేతర సంస్థలకు కేటాయించిందని సుప్రీంకోర్టు సోమవారం నిర్ధారించడం దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు అభిశంసనవంటిది! ఎందుకంటే 1993 నుంచి వివిధ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించాయి. డొంక కదలడంలో ఇది ఒక ఘట్టం మాత్రమే! మరో ఘట్టం నష్టం ఎంత?? ప్రభుత్వ ఖజానాలకు చేరవలసిన ప్రజాధనాన్ని ఏ మేరకు వివిధ వాణిజ్య సంస్థలు బొక్కాయియన్నది నిగ్గుతేల్చడం! 2004-2009 మధ్యకాలంలోని ఐదేళ్లలోనే బొగ్గు తవ్వకాలకోసం బొరియలను కేటాయించడంలో జరిగిన అక్రమాలవల్ల లక్షా ఎనబయి ఆరువేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. మరి 1993వ 2004వ సంవత్సరాల మధ్య జరిగిన కేటాయింపుల అక్రమాల ఫలితంగా ఇంకెన్ని వేల లేదా లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును పారిశ్రామిక ‘మహా మూషికాలు’ మెక్కేశాయి? అధికారులో రాజకీయ పార్టీలో బొక్కేశారు?? అన్నది ప్రధానంగా బయటపడివలసి ఉంది!! ఈ బొగ్గు బొరియల కేటాయింపులకూ, వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకృతం కావడానికి మధ్యగల సంబంధం కూడా ఇప్పుడు స్పష్టమైపోయింది. ‘వాణిజ్యం, సుంకాల సాధారణ వ్యవస్థ’ - జనరల్ అగ్రిమెంట్ షేర్ ట్రేడ్ టారీఫ్ - గ్యాట్ - లో మన దేశం చేరడం, ఈ బొగ్గు బొరియలను ప్రభుత్వేతర సంస్థలకు భారీ ఎత్తున కేటాయించడం మొదలు కావడం 1993లో జరిగిన రెండు వాణిజ్య విపరిణామాలు. ఈ ‘గ్యాట్’ ఆ తరువాత ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ - డబ్ల్యుటిఓ - గా రూపాంతరం చెందడంతో వాణిజ్య ప్రపంచీకరణ నెలకొనింది!! ‘ప్రపంచీకరణ’ ఫలితంగా జరిగిన ఒక ప్రధాన వైపరీత్యం అవినీతి వందలు వేయి రెట్లు పెరిగిపోవడం!! ప్రపంచీకరణకు పూర్వం మన దేశంలో బయటపడిన అతిపెద్ద అవినీతి కలాపం ‘బోఫోర్స్ హావిట్జర్’ శతఘు్నల కొనుగోలు వ్యవహారం! ఇటలీ దళారీ ఒట్టోవియో కత్రోచి మన దేశపు అధికార రాజకీయ వేత్తలతో కుమ్మక్కయి నిర్వహించిన ఆ భారీ అవినీతి కలాపం విలువ కేవలం అరవై ఐదు కోట్ల రూపాయలు!! ఇందులో ముప్పయి ఎనిమిది కోట్ల రూపాయలు మన దేశపు రాజకీయవేత్తలకు ‘ముడుపుల’ రూపంలో ముట్టి ఉండవచ్చునన్నది ప్రధాన ఆరోపణ! ఇది 1980వ దశకం ద్వితీయార్థం నాటి ‘ముచ్చట’! ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత అవినీతి కలాపాల విలువ వందల, వేల కోట్ల రూపాయల పరిమితిని దాటి లక్షల కోట్ల రూపాయలకు చేరింది!! రూపాయి విలువ కృశించిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ఆర్థిక పరిణామాంవల్ల 1980 నాటి వంద కోట్లు ఇప్పుడు వేయి కోట్ల రూపాయలు అయి ఉండవచ్చు! ఇది సహజం. కానీ వందకోట్ల అవినీతి పరిమాణం లక్షల కోట్లకు విస్తరించడానికి ఏకైక కారణం ప్రపంచీకరణ ‘అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం’! అందువల్ల బొగ్గు బొరియెల అవినీతి, ప్రతీక మాత్రమే! నిజమైన వైపరీత్యం దేశాన్ని ఆర్థికంగా నైతికంగా దివాలా తీయిస్తున్న ‘ప్రపంచీకరణ’... ప్రభుత్వ రంగంలోని సంస్థలవల్ల వాటి వాణిజ్య కలాపాలవల్ల రాజకీయ, అధికార అక్రమ అనుసంధాన కర్తల జేబులు పెద్దగా నిండవు! బహుళ జాతీయ సంస్థలకు ప్రాకృతిక సంపదను, ఉత్పాదక మాధ్యమాలను కట్టబెట్టడం ప్రపంచీకరణతో మొదలైంది. ఇలా కట్టబెట్టడానికి దోహదం చేస్తున్న అన్ని రకాల దళారీలకూ భారీగా ముడుపులు లభిస్తున్నాయి. రాజకీయ దళారీలకు మరింత భారీగా ఈ ‘లంచాలు’ విరాళాల పేరుతోను ఇతరేతర మార్గాల ద్వారా అందిపోతున్నాయి. అవినీతి పరిమాణం విస్తరించడానికి కారణం ఇదీ!! బొగ్గు బొరియలను అతి తక్కువ ధరలకు ప్రభుత్వేతర సంస్థలకు కట్టబెట్టారు! దీనివల్ల ప్రజలకు లేదా ప్రభుత్వ ఆర్థిక కోశానికి జమకావలసిన లాభాలను ఈ ప్రభుత్వేతర సంస్థలే బొక్కేశాయి. ఇలా బొక్కడానికి వీలు కల్పించిన రాజకీయ వేత్తలకు భారీగా ‘విరాళాలు’ దక్కాయి! బొగ్గు బొరియల కేటాయింపు అవినీతి కూపాల సారాంశం ఇదీ!! ఈ ‘కథ’ 2004 నుంచీ మాత్రమే నడిచిందనుకున్న వారికి కొత్త సమాచారాన్ని సర్వోన్నత న్యాయస్థానం వారి తీర్పువల్ల లభించింది. ఈ అవినీతి కథ 1993 నుంచీ నడుస్తోందన్నది ఈ కొత్త సమాచారం! బొగ్గు వౌలిక పారిశ్రామిక రంగానికి చెందిన సంపద! వౌలిక రంగంలో ఉత్పత్తులు పెరగడంవల్ల ఇతర పారిశ్రామిక రంగాలలో కూడా ఉత్పత్తులు పెరగడానికి వీలవుతుంది. బొగ్గు ఉత్పత్తులు పెరిగినట్టయితే బొగ్గు ఆధారంగా పనిచేసే విద్యుత్ ఉత్పాదక కేంద్రాల సంఖ్య పెరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్టయితే ఇతర పారిశ్రామిక కలాపాలు విస్తరిస్తాయి!! కానీ ప్రపంచీకరణ మొదలైన తరువాత బొగ్గు ఉత్పత్తులు అంతగా పెరగకపోగా కృత్రిమంగా కొరతను సృష్టించడానికి కుట్ర జరిగిపోయింది! 1993 నుంచి ఇంతవరకూ 218 బొగ్గు బొరియలలో తవ్వకాలు జరగాలని, ఉత్పత్తులు ఆరంభం కావాలని ప్రభుత్వం నిర్దేశించింది. ‘బొరియల’ను కేటాయించడం ఇందుకే! కానీ 218 బొగ్గు బొరియల - కోల్ బ్లాక్స్ లలో అత్యధికం తవ్వకాలకు నోచుకోవడం లేదు! 218 బొరియలలో పనె్నండు అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం కోసం కేటాయించారట! మిగిలిన 206 బొరియలలో 80 బొరియల ఒప్పందాలు రద్దయ్యాయట! కేవలం ముప్ఫయి బ్లాకులలో మాత్రమే ఉత్పత్తి ఆరంభమైంది!! ఇదంతా ప్రభుత్వేతర సంస్థలు పథకం ప్రకారం కొరతను సృష్టించడానికి చేసినట్టు స్పష్టమైంది! ఇంధనం చమురు, ఇంధనం వాయువుల ఉత్పాదక రంగంలో కూడా నిర్దిష్ట లక్ష్యాల వంటి చాలా తక్కువ స్థాయిలో ప్రభుత్వేతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయట!! దీనివల్ల ఆయా సంస్థలకు లాభమేమిటన్నది స్పష్టం కాకపోయినప్పటికీ, దిగుమతుల కోసం లక్షలాది కోట్ల ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ - ఖర్చయిపోవడం దేశానికి జరిగిన నష్టం... ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఈ బొరియల కేటాయింపులను రద్దుచేసినట్టయితే ‘కథ’ ఇరవై ఏళ్ళ వెనక్కిపోతుంది! అలా రద్దు చేయకపోయినట్టయితే అవినీతిపరులు, అక్రమ పారిశ్రామిక సంస్థలు జరిపిన నేరాలను క్రమబద్ధీకరించినట్టవుతుంది...!! ముందు నుయ్యి... వెనుక గొయ్యి!!

మరింత సమాచారం తెలుసుకోండి: