ఇండ్ల స్కామ్ ప్రాథమిక దర్యాప్తులోనే దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రెండేసి నియోజకవర్గాలకు చెందిన 36 గ్రామాల్లో సీఐడీ జరిపిన దర్యాప్తులోనే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడింది. ఇక రాష్ట్రం మొత్తం దర్యాప్తు జరిపితే వందల కోట్ల దుర్వినియోగం బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. సీఐడీ బృందాలు ఆయా గ్రామాల్లో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి జరిపిన దర్యాప్తులో దాదాపు ప్రతి గ్రామంలో కనిష్టంగా రూ.10 లక్షల దాకా దుర్వినియోగం జరిగిందని వెల్లడైంది. గరిష్టంగా రూ. 90 లక్షల నిధులు మింగేసిన గ్రామం కూడా ఉంది. మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ సీనియర్ మంత్రుల నియోజకవర్గాల్లో కూడా నిధుల దుర్వినియోగం భారీగానే జరిగింది. ఈ కుంభకోణంలో కిందిస్థాయి ఉద్యోగులనుంచి బడాబాబులదాకా అందరి పాత్రా ఉందని సీఐ డీ గుర్తించింది. ఉద్యోగులు, నాయకులు అన్యోన్యంగా కలిసిమెలిసి కోట్ల రూపాయలు పంచేసుకున్నారు. కట్టిన ఇండ్లకన్నా కొల్లగొట్టిన సొమ్మే అధికంగా ఉంది. శాంపిల్ సర్వేనే.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఇంటిపార్టీ అధికారం చేపట్టగానే ఈ కుంభకోణంపై దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ ఇండ్ల స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఇండ్ల స్కాంపై అన్ని గ్రామాల్లో ఒకేసారి దర్యాప్తు జరపడం సాధ్యంకాదు కాబట్టి సీఐడీ ముందుగా ప్రాథమిక దర్యాప్తును చేపట్టింది. తొమ్మిది జిల్లాల్లో శాంపిల్ సర్వే పేరిట దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ప్రతి జిల్లాలో ఒక్కో కేసు నమోదు చేసి జిల్లాకో బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇలా తొమ్మిది కేసులు, తొమ్మిది బృందాలను నియమించి గ్రామస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ఇండ్ల స్కాంలో ఉన్న అన్ని గ్రామాలను తిరగడం కష్టసాధ్యం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా నారాయణ్‌ఖేడ్, ఆందోల్, డోర్నకల్, భూపాలపల్లి, పాలేరు, అశ్వరావుపేట, ఎల్లారెడ్డి, బోధన్, మంథని, హుజురాబాద్, నాగార్జునసాగర్, దేవరకొండ, ఖానాపూర్, ఆసిఫాబాద్, కొడంగల్, అలంపూర్, తాండూర్, పరిగి నియోజకవర్గాలను సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఎంపిక చేసుకుంది. అందులో రెండేసి గ్రామాల్లో దర్యాప్తు ప్రారంభించింది. మాజీ మంత్రుల ఇలాఖాలో... శాంపిల్ దర్యాప్తులో భాగంగా ఎంచుకున్న 36 గ్రామాల్లోనే గత ప్రభుత్వ పెద్దలు, అధికారులు, నాయకులు కోట్లాది రూపాయలు దిగమింగారని సీఐడీ నివేదికలో స్పష్టంచేసింది. కొన్ని గ్రామాల్లో రూ.35 లక్షల నుంచి 90 లక్షల వరకు దుర్వినియోగం జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభిస్తే కొన్ని వందల కోట్ల దుర్వినియోగం తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని సీఐడీలోని ఓ ఉన్నతాధికారి టీ మీడియాకు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో 5 లక్షల నుంచి పది లక్షల వరకు నిధులు దుర్వినియోగమయ్యాయి. భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం అయిన నియోజకవర్గాలు గతంలో అమాత్యులుగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లవి కావడం సంచలనం కలిగిస్తున్నది. మాజీ డిప్యూటీ సీఎం నియోజకవర్గం అందోల్‌లోని ఒక గ్రామంలో రూ.37 లక్షలు దుర్వినియోగమైతే, మాజీమంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో 20 లక్షలకు పైగా దుర్వినియోగమయ్యాయి. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, జానారెడ్డి ఇలాఖాలోనూ ఇదే పరిస్థితి. మాజీ చీఫ్ విప్ గండ్ర నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో రూ.37లక్షలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే మింగేశారు. ఖమ్మం జిల్లా పాలేరు, అశ్వరావుపేట, నిజమాబాద్‌జిల్లా బోధన్, ఎల్లారెడ్డి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, దేవరకొండ, కరీంనగర్ జిల్లా మంథని, హుజురాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, అలంపూర్, రంగారెడ్డి జిల్లా తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో ప్రతి రెండు గ్రామాల్లో రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులు దుర్వినియోగం అయినట్టు సీఐడీ పోలీసులు తేల్చారు. దర్యాప్తులో భాగంగా నిధుల దుర్వినియోగంలో పాలుపంచుకున్న వారిని ఎంప్లాయిస్, నాన్ ఎంప్లాయిస్ విభాగాలుగా విభజించినట్టు సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎంప్లాయిస్ విభాగంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఎంఆర్‌వో, ఎంపీడీవోల వరకు బాధ్యులు ఉంటారని, అలాగే నాన్ ఎంప్లాయిస్‌లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలను చేరుస్తున్నట్టు తెలిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చిన గత ప్రభుత్వంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను సైతం బాధ్యులుగా చేసే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారి స్పష్టంచేశారు. అర్హులకు అందాల్సిన నిధులను దోచుకున్న ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగాచర్యలకు సిద్ధమవుతామని ఆయన స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: