ఇట్స్ కామన్.. రాష్ట్రంలోని పలు జైళ్లలో ఖైదీల వద్ద సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, సిమ్‌కార్డులు, గంజాయి పట్టుబడటం వాస్తవమేనని, ఇవన్నీ సాధారణమేనని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. మాకు ఇవన్నీ అలవాటే.. ఇట్స్ వెరీ కామన్ అంటూ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు. చెంచల్‌గూడ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి అధికారుల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి కదా? బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోరా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చర్యలు గిర్యలు జాన్తానై అంటూ అధికారులను వెనకేసుకొచ్చారు. సాక్షాత్తూ ఉన్నతాధికారే ఇలా వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే జైళ్లశాఖలో అక్రమాల దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత పదేండ్లుగా చర్లపల్లి జైలులోని అన్ని కీలక పదవుల్లో సీమాంధ్రులే కొనసాగుతున్నారు. ప్రతీనెలా రూ.10లక్షల వరకు మామూళ్లు వసూలు చేసి సూరి హంతకుడు భాను, గాలి బెయిల్‌స్కాం నిందితుడు యాదగిరిరావు తదితర రౌడీషీటర్లకు జైలు అధికారులు సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, గంజాయి సరఫరా చేస్తున్నారని ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ ప్రముఖ వ్యక్తి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోబోమని అడిషనల్ డీజీ వీకే సింగ్ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. జైళ్ల శాఖలో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అవినీతి అధికారులకు సదరు నాలుగు గంటలకు ముగుస్తాయి. ఉన్నతాధికారి వత్తాసు పలకడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటో వెలుగులోకి తేవాలన్న డిమాండ్ వినవస్తున్నది. మరోవైపు.. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ యాదగిరిరావు జైల్లోనే బెయిల్ డీల్ సెట్ చేస్తున్నాడని ఆయుబ్ ఖాన్ ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బెయిల్ ఇప్పిస్తానని చెప్పి రూ.30లక్షలు వసూలు చేశాడని, ఇదంతా జైల్లోనే జరిగిందని ఫిర్యాదు చేసినా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించలేదని ఆయన ఆరోపించారు. చర్లపల్లి జైలులో పనిచేస్తున్న ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇటీవల తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్నారని, ఆయనకు అక్కడేం పని? అని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కడుతున్న ఇంటికి భాను, యాదగిరిరావుకు సంబంధమేమిటన్న విషయమై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని వారు పేర్కొంటున్నారు. సీమాంధ్ర అధికారుల వల్ల తెలంగాణ జైళ్ల శాఖకు మాయని మచ్చ ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జైళ్లలో విద్యాదానం పథకం: జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నిర్లక్ష్యరాస్యులైన ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు విద్యాదానం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ తెలిపారు. జైళ్ల శాఖలో చేపడుతున్న సంస్కరణలపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని జైళ్లు దేశంలోని వివిధ రాష్ర్టాల జైళ్లకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహర్, రాజస్థాన్ రాష్ర్టాలలోని జైళ్లను ఆరు బృందాలు పరిశీలించాయని తెలిపారు. ఆ బృందాలు అందజేసిన నివేదికలను అధ్యయనం చేసిన తరువాత రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక్క వ్యక్తిని అక్షరాస్యుడిని చేసేందుకు దాదాపు రూ.10 వేలవరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. రూ.1.5 కోట్లతో చంచల్‌గూడలో మై నేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు, తెలంగాణ జైళ్ల శాఖకు కొత్త కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగంలో లేని జైళ్లను మ్యూజియంలుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ముందుగా సంగారెడ్డి జైలును మ్యూజియంగా మార్చి స్థానిక సంస్కృతి, చరిత్ర, భాషలకు సంబంధించిన వివిధ అంశాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఖైదీలు తయారుచేసే వస్తువులను పోలీసు క్యాంటిన్లలో కూడా విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జైళ్లలో ఆకస్మిక తనిఖీలు జరిపి లోటుపాట్లను తెలుసుకుంటున్నామన్నారు. తనిఖీ బృందాల్లో ఇతర జిల్లాలకు చెందిన అధికారులను నియమిస్తున్నామని, ఎస్పీఎఫ్ సిబ్బందిని కూడా భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: