శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో వారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి, పొందుపరిచారు. వాటి గురించిన సమగ్ర సమాచారాన్ని సేకరించిన కమిటీ, తొలి ప్రాధాన్యతగా మార్టూరు-వినుకొండ-దొనకొండ జోన్ ను పేర్కొన్నట్టు సమాచారం. నూతన రాజధాని నిర్మాణం కోసం ఇంతకుమించిన అనువైన ప్రదేశం మరొకటి లేదని కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి 19 పేజీల నివేదిక బుధవారం సమర్పించడం తెలిసిందే.  మార్టూరు-వినుకొండ-దొనకొండ జోన్ కు గుంటూరు వయా నరసరావుపేట స్టేట్ హైవేతో కనెక్టివిటీ ఉందని, కర్నూలు నుంచి గుంటూరు మార్గాన్ని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదన కూడా ఉందని కమిటీ పేర్కొంది. గుంటూరు-బెంగళూరు మార్గంలో వినుకొండ ప్రముఖ రైల్వే స్టేషన్ గా వెలుగొందుతోందని, ప్రతిపాదిన కాళహస్తి, నడికుడి లైన్లో ఇది ముఖ్య స్టేషన్ గా మారుతుందని చెప్పింది. భూమి లభ్యత పరంగా చూస్తే ఇదే అనుకూలమని, 5000 వేల హెక్టార్లకు పైగా బంజరుభూమి ఉందని తెలిపింది. ఏదేమైనప్పటికీ, తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. కాగా, ఏపీ సర్కారు మాత్రం విజయవాడ రాజధానికే మొగ్గు చూపుతుండడం తెలిసిందే. ఇప్పటికే పలువురు మంత్రులు బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: