అసెంబ్లీలో సభా సంప్రదాయాల గురించి టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఒక్కప్పుడు సభ మర్యాదలను ఉల్లంఘించిన వారే నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసగించేలా వ్యవహరిస్తోందని రోజా ఆరోపించారు. వైఎస్‌ను, జగన్ ను తిట్టడానికే అసెంబ్లీని ఏర్పాటు చేశారని టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సభా సంప్రదాయాలు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేయడం, ఆయనకు మైకులు ఇవ్వకుండా ఆనాడు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు.. ఈరోజు తమకు నీతులు చెబుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ చర్చ కోరితే అంగీకరించలేదని మైక్ ఇవ్వలేదని రోజా విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, మరోవైపు టీవీ ఛానల్స్ చర్చల్లో పాల్గొని జగన్ వారి గురించి ప్రస్తావించలేదు, వీరి సమస్యల గురించి చర్చించలేదని విమర్శించటం సిగ్గుచేటు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చించటం లేదంటూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అణా పైసలతో సహా రుణమాఫీ చేస్తామన్నారని…అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం రుణమాఫీపై బడ్జెట్ లో ప్రస్తావనే లేకుండా పోయిందన్నారు. ఓటు అనే చుక్క వేలు మీద పడి అధికారంలోకి వచ్చాక మాటలు మారుస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: