హైదరాబాద్ ను వణికిస్తోన్న స్నేక్ గ్యాంగ్ పాపం పండినట్టే కనిపిస్తోంది. ఎందరి ఉసురో పోసుకున్న ఆ పాము నేరగాళ్ల గుట్టు విప్పేందుకు హైదరాబాద్ పోలీసులు నడుంబిగించారు. స్నేక్ గ్యాంగ్ అరాచకాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ నిందితుల సెల్ ఫోన్లలో సుమారు నలభై ఘటనలకు సంబంధించిన దృశ్యాలను గుర్తించారు. మెమొరీకార్డుల నుంచి తొలగించిన డేటాను కూడా బయటకు తీసేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పహడీ షరీఫ్ ఫాంహౌజ్ లో యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధన నిందితుడు ఫైసల్ దయానీ ఫోన్ లో సుమారు ముప్ఫై, సాలం హందీల మొబైల్ లో సుమారు 16 జీబీల 11 వీడియోలను పోలీసులు గుర్తించారు. సెటిల్ మెంట్లు, పంచాయతీలు, దాడులు, మహిళలతో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఠా సభ్యులు గతంలో ఓ అంగన్ వాడీ కార్యకర్తను లైంగికంగా వేధించిన ఘటనపైనా దృష్టి సారించారు. బాధితురాలు అప్పుడు ఫిర్యాదు చేసినప్పటికీ... పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంపై విచారణ జరుపుతున్నారు. ఓ పాఠశాలలో చొరబడి ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. స్నేక్ గ్యాంగ్ ఫోన్లలోని మెమొరీ కార్డుల్లో తొలగించిన డేటాను కూడా రికవరీ చేసేందుకు సైబరాబాద్ సైబర్ నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ, పాములతో విన్యాసం చేసే సాలం హందీలను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. వారు చేసిన అరాచకాలు, గతంలో సహకరించిన నాయకులు, పోలీసుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ముఠాలోని కొందరు సభ్యులు మెమొరీ కార్డులు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. ఫోన్లో చిత్రీకరించని ఘటనలు కూడా ఉన్నాయా అనే కోణాల్లో విచారిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత ఎక్కడెక్కడికి పారిపోయారు, ఎవరు షెల్టరు ఇచ్చారనే అంశాలను కూడా ఆరా తీస్తున్నారు. సాలం హందీని శ్రీశైలంలో సుమారు మూడు కిలోమీటర్లు వెంబడించి చివరకు తెగించి అతని వాహనాన్ని ఢీకొని పట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాల భైరవుల గుట్టు తర్వలోనే రట్టయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: