మెదక్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఖరారు అయ్యాడు. ఆయన నామినేషన్ కూడా వేసేయడంతో ... నిన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ వ్యక్తి అయ్యాడు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ వాళ్లు తమకు అభ్యర్థులు కరువనే విషయాన్ని బయటకు చెప్పుకోవడానికే అన్నట్టుగా జగ్గారెడ్డిని అభ్యర్ఠిగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా పక్క పార్టీలోని వ్యక్తిని పార్టీలోకి చేర్చుకొని టికెట్ కేటాయించడం బీజేపీ కూడా నైతికంగా సమర్థించుకోదగని అంశమేమీ కాదు! ఒకవైపు కేంద్రంలో అధికారాన్ని సాధించుకొన్న ఉత్సాహంలో ఉన్న పార్టీకి ఇలా శత్రుపక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటో అర్థంకాని పరిస్థితి. ఈ సంగతి ఇలా ఉంటే ఇప్పుడు జగ్గారెడ్డి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తాడా? చేయడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జగ్గారెడ్డి బీజేపీ తరపునే పోటీ చేస్తున్నాడు. పవన్ కూడా బీజేపీ మనిషే! కాబట్టి ఇప్పుడు జగ్గారెడ్డి తరపున ప్రచారం చేయడం పవన్ బాధ్యతే అవుతుంది. అందులోనూ ఇది వరకూ జగ్గారెడ్డిన తనఅభిమాన రాజకీయ నేతగా చెప్పుకొచ్చాడు పవన్ కల్యాణ్. కేసీఆర్ తీరును తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి అయినందున జగ్గారెడ్డిని పవన్ తన అభిమాన నేతగా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు అదే జగ్గారెడ్డి బీజేపీ తరపు అభ్యర్థి అయ్యాడు కాబట్టి... పవన్ కు రెండో రకంగా కూడా బాధ్యతవచ్చి పడింది. అయినా పవన్ ఈబాధ్యతను తీసుకొంటాడా? అనేది సందేహాస్పదమైన విషయమే. ఎందుకంటే ఇప్పటి వరకూ పవన్ ప్రచారం గురించి ప్రకటనలేమీ లేవు. ఈ ఉప ఎన్నికలను టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో పవన్ ప్రచారానికి పెద్దగా ఉత్సాహం చూపకపోవచ్చనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: