తెలంగాణ నినాదంగా గత ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ కు క్రమంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓవైపు ముంచుకొస్తున్న కరువు..మరోవైపు భయపెడుతున్న విద్యుత్ సమస్య.. ఇంకోవైపు ఎన్నికల హామీల అమలు.. క్రమంగా పరిస్థితులు జటిలంగా మారుతున్న నేపథ్యంలో కనీసం రుణమాఫీ వంటి హామీనైనా ఏదో రకంగా నెరవేర్చి జనంలో కాస్తయినా పాజిటివ్ వేవ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మెదక్ ఉప ఎన్నిక కూడా దగ్గరపడుతున్న సమయంలో.. ఇలాంటి వ్యతిరేకత కొంప ముంచుతుందన్న సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే తక్కువ రుణం ఉన్న వాటిని నేరుగా మాఫీ చేయాలని యోచిస్తున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల మేర పంట రుణాన్ని మాఫీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన తెలంగాణ సర్కారు... ప్రస్తుతం మూడు రకాలుగా ప్లాన్ చేస్తోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా మాఫీకి అర్హులను ఎంపిక చేయడం, మాఫీకి అవసరమయ్యే సొమ్ము కోసం మార్గాల అన్వేషణ, రద్దు చేయాల్సిన మొత్తాన్ని రైతుకు సమకూర్చే పద్ధతులపై.. కసరత్తు మరికొన్ని రోజుల్లో కొలిక్కి రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అర్హత గల కుటుంబాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే...సరాసరి మాఫీ ప్రస్తుతానికి 58 వేల రూపాయలుగా ఉన్నట్లు తెలిపాయి. సామాజిక తనిఖీల తర్వాత... ఆ సగటు మరికాస్త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తక్కువ మొత్తంలో రుణం పొందిన రైతుల బకాయిలను ప్రభుత్వం నేరుగా చెల్లించే యోచన చేస్తోందని అధికారులు చెబుతున్నారు. బకాయి ఎక్కువగా ఉంటే మాత్రం.. కొంత మేర నగదు సమకూర్చి.. మిగతా దానిపై రైతుకు హామీపత్రం ఇచ్చే అవకాశముందని అంటున్నారు. చెల్లించే సొమ్మును రైతు తరపున బ్యాంకులకు అందజేయాలనే యోచన ఉన్నట్లు సమాచారం. అంటే.. ప్రభుత్వం చెల్లించే వాటా మినహా మిగిలిన మొత్తాన్ని రైతు ప్రస్తుతం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. హామీపత్రం ఆధారంగా చెల్లించిన సొమ్ముని ప్రభుత్వం అందిస్తుంది. వడపోతలు... రీషెడ్యూల్ అయ్యే రుణాలను మినహాయిస్తే.. సర్కారు సమకూర్చాల్సిన నిధులు దాదాపు 14 వేల కోట్ల రూపాయల మేర ఉంటాయని తెలుస్తోంది. ఇందులో కొంత మొత్తాన్ని త్వరలో బడ్జెట్ లో కేటాయిస్తారట. మరి ఈ కేసీఆర్ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: