టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోన్‌కాల్‌ మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికను రసవత్తరంగా మార్చివేసింది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ... ఈ ఎన్నికలో దీటైన అభ్యర్థి కోసం వారం రోజులుగా కసరత్తు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాయకులు బద్దం బాల్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డిలను పోటీకి దింపే ఆలోచన వచ్చినా వారెవరూ ఆసక్తి కనబరచలేదు. స్థానిక నేతలు ఇద్దరు, ముగ్గురి పేర్లను పార్టీ పరిశీలించినా వారిలో ఎవరు అభ్యర్థి అయినా ముందే చేతులెత్తేసినట్టవుతుందని పార్టీ భావించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో గతంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో పని చేసి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చురుకుగా వ్యవహరించి, అందరికీ పరిచయస్తుడైన మాజీ విప్‌ టి.జగ్గారెడ్డిపై బీజేపీ దృష్టి సారించింది. తమలక్ష్యం, జగ్గారెడ్డి లక్ష్యం టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవడమే కావడంతో బీజేపీ నాయకులు ఆయనతో సంప్రదింపులు మొదలు పెట్టినట్టు తెలిసింది. జగ్గారెడ్డి అభ్యర్థి అయితే సంగారెడ్డితో పాటు సెటిలర్లు ఎక్కువగా ఉన్న పటాన్‌చెరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓట్లు పొందవచ్చని ఆ పార్టీ భావించింది. ఈ నెల 26వ తేదీ రాత్రి వరకు బీజేపీ నుంచి పిలుపు వచ్చినా జగ్గారెడ్డి సుముఖత కనబరచలేదు. ఈ దశలో పార్టీ రాష్ట్ర నాయకుల ఒత్తిడితో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసి జగ్గారెడ్డితో మాట్లాడారు. జగ్గారెడ్డిని పోటీకి దిగాలని సూచించిన వెంకయ్య... ఓడినా పార్టీ పరంగా తగిన గుర్తింపు, ప్రాధాన్యమిస్తానని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో సినీనటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్‌ ఫోన్‌ చేసి జగ్గారెడ్డితో మాట్లాడినట్టు తెలసింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించిన పవన్‌... తాను రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్‌లో రోడ్‌షో జరుపుతానని జగ్గారెడ్డికి చెప్పినట్టు తెలిసింది. దీంతో బీజేపీలో చేరి, పోటీకి దిగాలన్న ఆలోచనకు వచ్చిన జగ్గారెడ్డికి చంద్రబాబు ఈ నెల 27న ఉదయం ఫోన్‌ చేశారు. ‘‘ఇంకెందుకు జాప్యం చేస్తున్నావు. వెంటనే బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగు..’’ అని జగ్గారెడ్డికి సూచించారు. దీంతో జగ్గారెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమై బీజేపీలో చేరి నామినేషన్‌ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: