ఆంధ్రప్రదేశ్ రాజధాని కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్యే నిర్మించాలని చంద్రబాబు అండ్ కో భావిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా రాజధాని ఉండాలని ప్రభుత్వం బలంగా భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా తొలి నుంచీ కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యనే రాజధాని అంటూ సీఎం చంద్రబాబునాయుడు ఇన్ డైరెక్టుగా చెబుతూనే ఉన్నారు. ఇక మంత్రులు మాత్రం బహిరంగంగానే చెబుతూ వచ్చారు. గురువారం శాసనసభ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో తన ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిందంటూ వార్తలు రావడంపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మంత్రులు తలోరకంగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రాజధాని అన్న విషయంపైనా చర్చ జరిగింది. భూమి అందుబాటులో లేదన్న ఒక్క అంశం తప్ప అన్నీ బావున్నాయని చంద్రబాబు చెప్పారట. భూమి కొంత వరకు అందుబాటులో ఉందని.... మిగతా దాన్ని రైతుల నుంచి అభివృద్ది నిష్పత్తి పద్దతిలో సేకరించవచ్చని బాబు అన్నారు. రైతుల నుంచి భూమిని సేకరించి దాన్ని అభివృద్ధి చేసి అందులో 40శాతం వాటాను రైతులకు ఇస్తే బాగుంటుందని మనసులో మాట బయటపెట్టారు. గతంలో కృష్ణా జిల్లాలోని జక్కంపూడి గ్రామంలో ప్రభుత్వం కొంత భూమిని రైతుల నుంచి ఇదే పద్దతిలో సేకరించిందట అయితే.... రైతులకు ఇవ్వాల్సిన 40శాతం భూమి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం యుద్దప్రాతిపదికన భూమి అభివృద్ధి చేపట్టి రైతులకు వాటా ఇస్తే నమ్ముతారని బాబు మ్యాప్ గీస్తున్నారు. మరో రెండు, మూడు రోజల్లో రైతుల వాటా భూమిని వారికి ఇచ్చేందుకు ప్రణాళిక కూడా రెడీ అవుతోందట. ఏదేమైనా బెజవాడ-గుంటూరు మధ్యనే రాజధాని నిర్మించాలని బాబు పట్టుదలగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: