మరో తెలంగాణ ముద్ర దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సంస్కృతీ, సాహిత్యం, చరిత్రను.. భవిష్యత్తు తరాలకు పరిచయం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. పాఠ్య పుస్తకాలను సమూలంగా సమీక్షించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్... ఆయా విషయాల్లో నిష్ణాతులైన మేధావులతో... నూతన పాఠ్యాంశాల రూపకల్పనకు కమిటీని నియమించింది. తెలుగు పుస్తకాల సమీక్షకు జాతీయస్థాయిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు ప్రొఫెసర్ రమాకాంత్ అగ్నిహోత్ని సారథ్యం వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి రవ్వా శ్రీహరి, కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుడు కోవెల సుప్రసన్నాచార్య, కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు ప్రొఫెసర్ బన్నా ఐలయ్య, ఉస్మానియా యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.రఘు, తెలంగాణ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్.... బాల శ్రీనివాసమూర్తిలతో కమిటీ ఏర్పాటు చేసింది. తెలుగు భాషా నిష్ణాతుల కమిటీలో సభ్యులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సాహితీ వేత్త నందిని సిద్ధారెడ్డి, కవి దేశపతి శ్రీనివాస్, విశ్రాంత ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి, వరంగల్ సీటీఈ విశ్రాంత ప్రిన్సిపల్ సాంబమూర్తి, తెలంగాణ రచయితల వేదిక నుంచి వేణు సంకోజు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ అధ్యాపకుడు నెలిమెల భాస్కర్‌లను నియమించింది. తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపదను పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచేందుకు వీలుగా సాంఘికశాస్త్రంలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ స్థాయి తెలుగు, సాంఘిక శాస్త్రం సమీక్షా కమిటీలో.... మధ్యప్రదేశ్ లోని భూపాల్ ఏకలవ్య విశ్వవిద్యాలయం అధ్యాపకుడు సి.ఎన్ సుబ్రహ్మణ్యం.... ఎన్.సి.ఇ.ఆర్.టి.లో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఎమ్వీ శ్రీనివాసన్‌ను కమిటీ సభ్యులుగా నియమించింది. రాష్ట్రస్థాయి కమిటీలో కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. విజయబాబు.... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ కె. కైలాశ్.... ఉస్మానియా విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు... తెలంగాణ ఐకాస అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్.... హైదరాబాద్ ఆర్కియాలజీ విభాగం నుంచి డాక్టర్ ఈఎస్ నాగిరెడ్డిలకు చోటు కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: