చంద్రబాబు పాలన అంటే గతంలో ఉద్యోగుల్లో ఒకటే గుబులు ఉండేది. నిరంతరం ఉద్యోగుల వెంటపడి.. వారితో పనిచేయించిన ఘనత ఆయనది. అంతే కాదు.. ప్రభుత్వ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగాలు సృష్టించి సర్కారు జీతాల భారాన్ని భారీగా ఆదా చేశారాయన. విద్యావాలంటెర్లు తరహాలో కొత్త కొత్త పేర్లతో తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించిన ఘనత చంద్రబాబుదే. క్షేత్రస్థాయిలో పంచాయతీ సెక్రటరీ వంటి కీలక పోస్టులను కూడా కాంట్రాక్టు బేసిక్ మీద నియమించిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. అలాంటి బాబుకు పదేళ్ల ప్రతిపక్ష పాత్ర తర్వాత జ్ఞానోదయమైనట్టుంది. ఇక ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగాలు తప్ప కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని బాబుగారి సర్కారు ప్రకటించింది. ప్రైవేటైజేషన్ వైపు మొగ్గుతాడని పేరున్న చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని బాబు డైరెక్టుగా ప్రకటించలేదు. శాసన మండలిలో ఓ ప్రశ్నకు సమాధానంగా కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయం తెలిపారు. ఏపీలో దేశంలోనే ఉత్తమమైన పారిశ్రామిక విధానం తెస్తామని ప్రకటించారాయన. కార్మిక చట్టాల అమలుకు, పారిశ్రామిక ప్రశాంతతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఆ సందర్భంలోనే ఇక ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవని మంత్రి ప్రకటించారు. అనుభవంలోకి వస్తే కానీ తత్వం బోధపడని ఓ నానుడి. చంద్రబాబు విషయంలో ఇదే నిజమైనట్టుంది. దాదాపు పదేళ్ల పాలనలో ఉద్యోగుల నుంచి ఎంతో వ్యతిరేకత బాబు మూటగట్టుకున్నాడు. కానీ ప్రభుత్వానికి వెన్నెముక ఉద్యోగులే. ముఖ్యమంత్రులు, మంత్రులు ఐదేళ్లకోసారి మారుతుంటారు. కానీ శాశ్వతంగా ఉండేది వారే. అందుకే 2004 ఎన్నికల సమయంలో ఉద్యోగులు చంద్రబాబుపై పగబట్టి మరీ ఓడించారని చెబుతారు. ప్రత్యేకించి అప్పడే అమల్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను ఆయుధంగా మలచుకుని బాబును ఓడించారు. చాలాచోట్ల పోలింగ్ బూతుల్లో సిబ్బందే చదువురాని వారి ఓట్లు వేసేశారని విశ్లేషకులు చెబుతారు. అందుకో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: