మీడియా క్రమంగా విశ్వసనీయత కోల్పోతోంది. పాతికేళ్ల క్రితం అచ్చులో ఓ అక్షరం వస్తే అది శిలాశాసనమని భావించేవాళ్లు. పేపర్లో ఓ వార్త వచ్చిందంటే.. అది నిజామా కాదా అన్న సందేహమే పాఠకులకు వచ్చేది కాదు. మారుతున్న జర్నలిజం విలువలు. పత్రికారంగంలో పెరిగిన విపరీతమైన పోటీ. సర్క్యులేషన్ పెంచుకునేందుకు పేపర్ల తిప్పలు.. అన్నీ కలసి జర్నలిజం విలువలను మంటకలుపుతున్నాయి. తాజాగా ఏపీలో మోస్ట్ ఇంట్రస్టింగ్ టాపిక్ అయిన రాజధాని అంశంలో ఈ విషయం మరోసారి రుజువయ్యింది. శివరామకృష్ణన్ కమిటీ నాలుగు రోజుల క్రితం కేంద్రానికి తొలి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక వివరాలు కేంద్రం వెల్లడించకముందే.. మీడియాకు లీక్ అయ్యాయి. ఇలాంటి లీకులు సాధారణంగానే జరుగుతుంటాయి. కానీ.. నివేదిక వివరాలు తెలిసేటప్పటికి రాత్రి బాగా పొద్దుపోవడం.. నివేదిక ఆసాంతం చదివి వార్త ఇచ్చేంత సమయంలేకపోవడంతో పత్రికలు అరకొర సమాచారాన్నే వండివార్చాయి. ఇది కూడా ప్రింట్ జర్నలిజంలో తరచూ జరిగేదే.. కానీ ఇక్కడే ఓ పొరపాటు జరిగిపోయినట్టుంది. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని అంటే హైదరాబాద్ లా అన్నీ ఒకేచోట ఉండేలా వద్దే వద్దంటూ చెప్పింది. అంతే కానీ.. రాజధాని ఎక్కడ పెట్టాలో మాత్రం చెప్పలేదు. సీఎం కార్యాలయం, సెక్రటేరియల్, హైకోర్టు, అసెంబ్లీ, ఇతర ముఖ్యమైన కార్యాలయాలు.. ఒక్కోటి ఒక్కో చోట పెట్టమని సలహా ఇచ్చింది. ఈ విషయాన్ని మాత్రం పేపర్లు సరిగ్గా రాయలేకపోయాయి. అంతేకాదు.. నివేదికలో లేకపోయినా.. మార్టూరు-వినుకొండ-దొనకొండ ప్రాంతంలో రాజధాని పెట్టమని సలహా ఇచ్చినట్టు రాశాయి. వాస్తవానికి కమిటీ చెప్పిందేమిటంటే.. ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించమని రాష్ట్రం కేవలం ఇన్ ఫార్మల్ గా చెప్పిందని.. తాము మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టంగా రిపోర్టులో పేర్కొన్నాయి. ఏపీ జనం భగవద్గీతగా భావించే ప్రముఖ పత్రిక సహా దాదాపు అన్ని పత్రికలు ఈ విషయంలో తప్పులో కాలేశాయి. తీరా.. శుక్రవారం రాత్రి నివేదికను కేంద్ర హోంశాఖ వెబ్ సైట్లో పెట్టాకగానీ అసలు విషయం బయటపడలేదు. కావాలంటే మీరూ చూడండి..mha.nic.inలో నివేదిక పూర్తిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: