తన ఛరిష్మాతో భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టి, భారత అధికారం పీఠంపై కూర్చున్న నాయకుడు నరేంద్ర మోడీ. అంతకుముందు మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ... పీఎంగా ఇంకా వందరోజులు కూడా పూర్తి చేసుకోలేదు. కానీ పీఎం అయిన తర్వాత సీఎంలతో ప్రవర్తిస్తున్న తీరు మాత్రం పలువురిలో అసంతృప్తి జ్వాలలను రగిలిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దాదాపు అన్ని రాష్ర్టాల సీఎంలతో నరేంద్రునికి మంచి సంబంధాలు ఉండేవి. ప్రధాని అయ్యాక మాత్రం ఆయన వైఖరి పూర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని కుర్చీలోకి రాక ముందు కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరించే తీరుపై పలుసార్లు తప్పుబట్టారు. తాను పీఎం అయితే రాష్ట్రాలతో ప్రవర్తన పూర్తిగా మార్చేస్తానని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతోంది. మోడీకి సీఎంలతో విబేదాలు హర్యానా నుంచి ప్రారంభమయ్యాయి. హర్యానా అసెంబ్లీ పోయిన నెలలో తమ రాష్ట్రంలోని గురుద్వారాల నిర్వహణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టానికి గవర్నర్‌ తన ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దీనిపై హర్యానా సీఎం హుడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఈ నెల 19న హర్యానాలో ప్రధాని మోదీ పాల్గొన్న ఒక సభలో కొంత మంది ముఖ్యమంత్రిని హేళన చేయడంతో ఇద్దరి మధ్యా సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. హర్యానా తర్వాత జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చౌహాన్‌లకూ ఇదే అనుభవం ఎదురైంది. అలాగే గవర్నర్‌ ద్వారా హైదరాబాద్‌పై పెత్తనం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య విధానాల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని విమర్శించడమేగాక....అవసరమైతే దీనిపై ప్రధాని మోదీతో అమీతుమీ తేల్చుకుంటామని హెచ్చరించారు. సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు నెరిపిన మోడీ... పీఎం అయిన తర్వాత మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు అధికమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: