తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల కీలక నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఇందులోభాగంగా గురువారం మెదక్ జిల్లాకు చెందిన పలువురు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.సీఎం క్యాంపు కార్యాలయానికి తమ అనుచరగణంతో వచ్చి న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, బీజేపీ నాయకుడు, 2014 ఎన్నికల్లో మెదక్ లోక్‌సభకు బీజేపీ తరఫున పోటీ చేసిన నరేంద్రనాథ్, మెదక్ కాంగ్రెస్ నేత స్వామిచరణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం స్వయంగా కండువాలు వేసి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టీ రాజ య్య, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాబూమోహన్, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ పాల్గొన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరాం: నరేంద్రనాథ్ ------------------------------------------------- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో చేరామని బీజేపీ నేత నరేంద్రనాథ్ తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని, ఇందులో భాగస్వాములయ్యేందుకు పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. చేరికలతో టీఆర్‌ఎస్ మరింత బలపడింది: హరీశ్‌రావు ------------------------------------------------------- ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై, ప్రజలకు సేవ చేసేందుకు అనేక పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో పలు పార్టీల నుంచి జరుగుతున్న చేరికలతో టీఆర్‌ఎస్ మరింత బలపడిందన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంవద్ద విలేకరులతో మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. భవిష్యత్తులో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్‌వేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదరికాన్ని పారదోలేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని చెప్పారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీల కళ్లలో ఆనందం చూసేందుకు, పేదరికాన్ని పారద్రోలి, వారి ముఖంలో చిరునవ్వును చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నారని చెప్పారు. మెదక్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తాము పని చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: