ఖమ్మం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బే తగిలిందా అంటే అవుననే టాక్ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇంతకాలం జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వర రావు పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా టీడీపీ వైఖరిపై అసంతృప్తితో వున్న తుమ్మల, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. దీనికితోడు నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ లో కేసీఆర్ తో పదిహేను నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. దాదాపు సెప్టెంబర్ 5వ తేదీన ఆయన తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నారని సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక మిగిలిందల్లా 5వ తేదీన ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమేనని తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వర రావుతోపాటే జిల్లాలో జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ అధ్యక్షుడు విజయ్ బాబు, కొండబాల కోటేశ్వర రావు, నాగచంద్రా రెడ్డి లాంటి కీలక నేతలు చాలామంది టీఆర్ఎస్‌లో చేరుతుండటం టీడీపీకి జీర్ణించుకోలేని పరిణామంగా మారింది. పార్టీపై కొంతకాలంగా అలకవహించిన తుమ్మలని టీడీపీకి చెందిన చాలామంది నేతలు కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు చెందిన టీడీపి నేతలు ఆయన పార్టీకి రాజీనామా చేయకుండా వుండేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ జిల్లాలో మరో కీలక నేత అయిన నామా నాగేశ్వర రావు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో వున్న ఆయన చివరికి పార్టీని వీడడానికే మొగ్గు చూపారు. తుమ్మలతోపాటు ఖమ్మం జిల్లా నేతలే కాకుండా వరంగల్‌కి చెందిన నేతలు సైతం ఆయన బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేకానీ జరిగితే ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలోనూ ఈ ప్రభావం మరింత అధికమవవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: