లోక్‌సభ వంశపారంపర్య రాజకీయాలు,కులరాజకీయాలకు ప్రతిబింబంగా మారటం దురదృష్టకరమైన పరిణామము. ఈ సారి కూడా కొన్ని రాజకీయ కుటుంబాలు, కొన్ని వర్గాలకు చెందిన వారే మరోసారి పార్లమెంటులో సింహభాగాన్ని ఆక్రమించారు.భారత దేశం వందలాది కులాలు,వర్గాల ప్రజల సమాహారమైనప్పటికీ పార్లమెంటు మాత్రం కొన్ని కులాలు, వర్గాల అధికార కేంద్రంగా మారింది. దేశంలోని కొన్ని కులాలు,వర్గాలకు ఎన్నో సంవత్సరాల నుండి పార్లమెంటులో ప్రాతినిధ్యం లభించటం లేదు. రిజర్వేషన్ల మూలంగా ఎస్.సి, ఎస్.టి వర్గాలకు ప్రాతినిధ్యం లభించినా అది కూడా వంశపారంపర్యం, కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా మారింది తప్ప ఎస్.సి, ఎస్.టి వర్గాలవారందరికి సమ న్యాయం లభించటం లేదు. పదహారవ లోక్‌సభలో దాదాపు 135 మంది లోక్‌సభ సభ్యులు వంశపారంపర్య రాజకీయాలు,వర్గాల రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించటం దీనికి నిదర్శనం.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను తల్లి, కొడుకుల పార్టీగా అభివర్ణించటం తెలిసిందే. అయితే పదహారవ లోక్‌సభలో బి.జె.పి అధినాయకత్వం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకుల కొడుకులు, కూతుళ్లను లోక్‌సభకు గెలిపించి వంశపారంపర్య రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పకతప్పదు.బి.జె.పికి చెందిన రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రస్తుత ముఖ్యమంత్రుల కొడుకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్,్ఢల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారులు లోక్‌సభకు ఎన్నికకావటం బి.జె.పి వంశపారంపర్య రాజకీయాలకు మచ్చుతునకలు. బి.జె.పికి చెందిన కొందరు మాజీ కేంద్ర మంత్రులు, ఎం.పిల కొడుకులు, కూతుళ్ళు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్,బి.జె.పి,బి.జె.డి, శిరోమణి అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, లోక్‌జనశక్తి, డి.ఎం.కె, అన్నా డి.ఎం.కె,శివసేన ఇలా ఏ పార్టీని తీసుకున్నా వంశపారంపర్య రాజకీయాలు,కుటుంబ రాజకీయాల ఆధారంగా కొనసాగుతున్నవే తప్ప నిజమైన ప్రజస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తున్నవి లేవు. అధికారంలో ఉన్న బి.జె.పి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎం.పిల్లో ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మంది రాజకీయ కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించటం గమనార్హం.రాజకీయ కుటుంబాల సహాయ, సహకారాలతో గెలిచి వచ్చే ఇతర ఎం.పిలు వీరికి లొంగి ఉంటారనేది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మొత్తం నలభై రెండు మంది లోక్‌సభ సభ్యుల్లో పద్దెనిమిది మంది రాజకీయ కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. లోక్‌సభకు ఎన్నికైన వారిలోమొత్తం సభ్యుల్లో దాదాపు డెబ్బై మంది ప్రస్తుత లేదా మాజీ ఎం.పిలు, శాసన సభ్యుల సంతానం కావటం గమనార్హం. వారసత్వ రాకీయాలు, కుటుంబ రాజకీయాలు, వంశపారంపర్య రాజకీయాలకు పురుషులతోపాటు మహిళలు కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. లోక్‌సభకు ఎన్నికైన పదకొండుమంది మహిళా సభ్యులు ఎం.పిలు లేదా శాసన సభ్యుల కూతుర్లే. ఇదిలా ఉంటే పది మంది మహిళా సభ్యులు ప్రస్తుత లేదా మాజీ ఎం.పిలు లేదా శాసన సభ్యుల భార్యలు. మరో పది మంది ప్రస్తుత లేదా మాజీ ఎం.పిలు లేదా శాసన సభ్యుల సోదరులు,బాబాయిలు, కోడళ్లు, చిన్నమ్మ,పెద్దమ్మ పిల్ల లు, అత్తా,మామల సంతానమే. ఆంధ్రప్రదేశ్,తెలంగాణాతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్,తమిళనాడు, జమ్ముకాశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వంశపారం పర్యతకు పెద్ద పీట వేస్తున్నాయి.కేరళ రాజకీయాల్లో వంశపారంపర్య రాజకీయాలు,వారసుల సంఖ్య అతి తక్కువ. పదహారవ లోక్‌సభకు ఎన్నికైన యువ ఎం.పిలు అంటే 30 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ఎం.పిల్లో దాదాపు 76 శాతం మంది రాజకీయ నాయకుల కొడుకులు లేదా కూతుళ్లే. ముప్పై నుండి నలభై సంవత్సరాల వయస్సు ఉన్న లోక్‌సభ సభ్యుల్లో తొంబై శాతం మంది రాజకీయ వారసులే. 61 మంది మహిళా ఎం.పిల్లో ముప్పై మంది రాజకీయ కుటుంబాలకు చెందిన వారు. కాంగ్రెస్ ఎం.పిలంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదుపు ఆజ్ఞలో ఉంటే పదకొండు మంది టి.ఆర్.ఎస్ ఎం.పిలు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత కనుసన్నల్లో రాజకీయం చేయకతప్పటం లేదు. శిరోమణి అకాలీదళ్ సభ్యులు పంజాబ్ ముఖ్యమంత్రి కోడలు, పముఖ్యమంత్రి భార్య,కేంద్ర మంత్రి హర్‌సిమ్రాన్ కౌర్ ఆదేశాలకు కట్టుబడి పని చేయకతప్పదు. సమాజ్‌వాదీ పార్టీకి లోక్‌సభలో కేవలం నలుగురే సభ్యులున్నా వాళ్లంతా ములాయం సింగ్ యాదవ్ కుటుంభ సభ్యులే. లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని జముల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి వచ్చారు. చిరాగ్ పాశ్వాన్ హిందీ సినిమా రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన తరువాత రాజకీయ ఆరంగేట్రం చేసి ఇప్పుడు లోక్‌సభ సభ్యుడయ్యాడు. లోక్‌జనశక్తి తండ్రి, కొడుకుల పార్టీ అనేది అందరికి తెలిసిందే. రాజకీయ కుటుంబాలకు చెందిన ఎం.పిలు ఆర్థికంగా, విద్యాపరంగా బాగా ముందుండటంతో అన్ని అవకాశాలను వీరే దక్కించుకుంటున్నారు. మొత్తం రాజకీయమంతా వీరి చుట్టే తిరగటంతోపాటు, ఆర్థికబలం కూడా వీరికే చేరుతోంది. దీనితో వీరు మరింత బలపడటం వలన పరోక్షంగా ప్రజస్వామ్యం బలహీనపడిపోతోంది. వైద్యుల పిల్లలు వైద్యులు, లాయర్ల పిల్లలు లాయర్లు అయినప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాలలోకి వస్తే తప్పేమిటి అనే వాదన అర్థరహితమైంది. వైద్యుల పిల్లలు వైద్యులు, లాయర్ల పిల్లలు లాయర్లు అయ్యేందుకు కొన్ని ప్రాథమిక అర్హతల సంపాదన అవసరం. ఎం.బి.బి.ఎస్‌లో సీటు లభించకపోతే డాక్టర్ కొడుకు ఎటువంటి పరిస్థితిలో కూడా డాక్టరు కాలేడు కానీ రాజకీయ నాయకుల పిల్లలకు ఇలాంటి ప్రాథమిక అర్హతలేమీ ఉండనవసరం లేదు. డబ్బు, అధికారంతో సీటు సంపాదించి శాసన సభ లేదా పార్లమెంటుకు తమ పిల్లలను ఎంపిక చేయించి వారికి బంగారు బాటలు వేసుకునే ఈ వంశపారంపర్య రాజకీయాలకు తెర పడదా?

మరింత సమాచారం తెలుసుకోండి: