మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన ధన్‌ యోజన పథకం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ మైలేజీ కోసం పాకులాడితే, ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టమొచ్చినట్టు వాడుకొని, చివరకు నష్టజాతక సంస్థలనే ముద్రవేసి వాటిని కుళ్లబొడవడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారిపోయింది. ప్రభుత్వరంగంలోని విద్య, వైద్య వ్యవస్థలను ఇప్పటికే దిగ్విజయంగా ధ్వంసం చేసిన ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థలను ప్రయివేట్‌ సంస్థలకు అప్పగించే ఎజెండాను భుజనవేసుకున్నాయి. మనం చూస్తుండగానే ఆ ప్రక్రియ పూర్తికావొచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంక్‌ల వంతు వస్తోందా? అన్న అనుమానం కలుగుతోంది కొత్తగా మొదలైన హడావిడి చూస్తుంటే. ప్రతి ఒక్కరికీ బ్యాంక్‌ అకౌంట్‌ అనే మోడీ ప్రభుత్వ సరికొత్త నినాదం పైకి ఎంతో ఉదాత్తంగానూ, అబ్బురంగానూ కనిపిస్తున్నప్పటికీ, లోతుల్లోకి వెళ్లి ఆలోచించినాకొద్ది రాబోయే అశుభానికి సూచికగా ఎడమ కన్ను అదురుతున్న ఫీలింగ్‌ కలుగుతోంది. ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్‌ ఇస్తామనీ, అయిదు వేల రూపాయల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తామనీ, లక్ష రూపాయల దాకా ప్రమాద భీమా కల్పిస్తామనీ ఆగస్టు 15న ప్రధాని మోడీ వాగ్ధానం చేసింది మొదలు ఈ పథకం అమలుపై ప్రభుత్వరంగ బ్యాంక్‌ల హడావిడి మొదలైంది. మొదట్లో ఈ పథకంపై ప్రభుత్వరంగ బ్యాంక్‌లు పెద్దగా ఆసక్తి చూపకపోయిన్నప్పటికీ, బ్యాంక్‌ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఏడు లక్షలకు పైగా మెయిల్స్‌ రావడంతో కొత్త అకౌంట్లు తెరిచే సన్నాహాలు జోరందుకున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 60వేలకు పైగా క్యాంపులు ఏర్పాటు చేశాయంటే వాటి మీద రాజకీయ ఒత్తిడి ఎంత తీవ్రంగా వుందో ఊహించుకోవచ్చు. ఏయే అప్రకటిత, రహస్య లక్ష్యాలను మనసులో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత ఒత్తిడితో అమలు చేయిస్తున్నారో సామాన్యులకు ముందుముందుగానీ బోధపడదు. బహుశా అది అర్ధమయ్యేలోగానే కొందరికి జరగకూడని డ్యామేజీ జరగనూవచ్చు. ఈ పథకం తమను ఎక్కడ బలి తీసుకుంటుందోనన్న ఆందోళన ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని తొలచివేస్తోంది. మన దేశంలో 75వేలకు పైగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ల బ్రాంచ్‌లు వుంటే, ప్రయివేట్‌ రంగంలో 16వేల బ్రాంచ్‌లున్నాయి. ఇంకనూ అనేక గ్రామాలలో బ్యాంక్‌ శాఖలు లేవు. సాధారణంగా లాభాలులేని చోటుకి ప్రయివేట్‌ సంస్థలు వెళ్లవు. జన ధన్‌ యోజన పథకం సేవలు అందరికీ విస్తరించాలంటే, మోడీ స్వప్నం నెరవేరాలంటే ప్రభుత్వరంగ బ్యాంక్‌లు మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించాల్సి వుంటుంది. చివరకు అది ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు మోయలేని భారంగా పరిణమించినా ఆశ్చర్యపోనక్కరలేదు. 5వేల రూపాయల ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఎక్కడ దుర్వినియోగం అవుతుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా పేదలకు ఆర్థిక అంటరానితనం పోతుందని నమ్మకంగా చెబుతున్న మోడీ మీదనే ఈ పథకం ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు భారంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: