రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్‌ కమిటీ నివేదికలో అన్నీ అవాస్తవాలే ఉన్నట్లు మాజీ ఎంపీ రైతు నాయకుడు డాక్టర్‌ యలమంచలి శివాజి ధ్వజమెత్తారు. రాజధాని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్‌ నిర్ణయించుకుంటాయన్నారు. గుంటూరులో డాక్టర్‌ శివాజి విలేకరులతో మాట్లాడుతూ రాజధానిపై మూడు కమిటీలు వేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం శివరామ కృష్ణన్‌ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కమిటీ, వనరుల సమీకరణ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ మూడు కమిటీలు పరస్పర విరుద్ధ నివేదికలు ఇచ్చాయన్నారు. ఎక్కడికి వెళితే అక్కడే రాజధాని అంటూ స్థానిక ప్రజల్లో ఆశలు కల్పించారని అన్నారు. రాజధానికి వేల హెక్టార్లు భూమి అవసరమని కమిటీ ప్రతిపాదించడాన్ని శివాజి తప్పు పట్టారు. హైదరాబాద్‌లో 4,500 మంది ఉద్యోగులు పని చేసే సెక్రటేరియేట్‌ 23 ఎకరాల్లో ఉందన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ 2,500 మంది పని చేసే సెక్రటేరియేట్‌ కు ఎన్ని ఎ కరాలు అవసరమని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి రూ. 5వేల కోట్లు అవసరమని శివరామ కృష్ణన్‌ సూచించారు. ఈ నిధులు ఎవరు కేటాయిస్తారని శివాజి ప్రశ్నించారు. 13 ఏళ్ల క్రితం ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌ రాజధానికి ఇప్పటి వరకు రూ. 776 కోట్లు, జార్ఖండ్‌కు రూ. 200 కోట్లు, ఉత్తరాంచల్‌కు రూ. 436 కోట్లు కేటాయించారు. రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వదని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలకు గుంటూరు- విజయవాడ ప్రాంతం రాజధానికి అనువైందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: